శీర్షిక-: *బాసట నిలచిన బాటసారి *
రచన-: విజయ గోలి గుంటూరు
గూడు ముందు కొచ్చందని
గుప్పెడు మెతుకులు పెట్టినందుకు
కొంగట్టుకు తిరిగే కన్న బిడ్డలా
చుట్టు చుట్టూ తిరుగుతూ
నీ గుమ్మమే నా గమ్యమంటూ
గుండెల్లో చేరింది కుక్క పిల్ల..
జత నడిచన జోడు
తరుణమొచ్చిందని తరలి పోతే
తోడులేని పాదాలు తడబడుతూ
బ్రతుకు ఏమిటని అడుగుతున్నాయి
కాలు తడవక కడలి బాట తరగదు
అడుగడగున అడ్డుపడే
ఆపదలకు..అడ్డునిలుస్తూ
మనిషిని మించిన మానవత్వంతో
అలుపెరుగని సిపాయిలా.
కంటిచూపుతో కష్టమెరిగి
ఒంటరి బ్రతుకున ఓర్పు నేర్పుతూ
పంటచేనుకు కంచెలాగ
గుబులు నెరిగిన నేస్తమయ్యి
గుప్పెడు తిన్న విశ్వాసంతో..
గుండె నిండా ఎదురులేని…
ఆత్మ విశ్వాసం పెంచుతూ
తోడు దాటని నీడలా ..
మాట్లాడని మనసు తెలిసిన స్నేహమా
బాసట నిలచిన బాటసారి వందనం