గజల్. రచన ..విజయ గోలి
భావాలే భ్రమరాలుగ భాసిల్లిన వైభవమే
సుమవనిలో రసధునిగా విరజల్లిన వైభవమే
అరవిరిసిన ప్రతిపువ్వూ అడుగుతుంది కైవల్యం
అర్హతలే అందమంటు విరపూసిన వైభవమే
మల్లెలతో మరువాలే కలిసివుంటె పరవశమె
సత్సంగం సద్భావన స్నేహించిన వైభవమే
సృష్టికైన కావాలిగ అడుగువేయ శివుడాజ్ఞ
కైలాసమె గేహముగా విలసిల్లిన వైభవమే
శ్రీలక్ష్మియె అడుగిడితే ఇంటింటా “విజయ” ములె
విధిరాతను వాగ్దేవియె లిఖియించిన వైభవమే