గజల్ విజయ గోలి
నందన వనమున విరిసిన సుమాల హాసమె అందం
విరులను తాకుతు తుమ్మెద ఆడిన సరసమె అందం
పున్నమి జాబిలి వేడుక చేయగ మబ్బుల దాగెను
నింగిన వేచిన తారలు మోసిన విరహమె అందం
మల్లెలు మొల్లలు మత్తుగ నవ్వెను మదనుని శరముల
పొన్నలు పొగడలు పంచిన పరువపు గంధమె అందం
కోయిల కూతల ఆమని పాడెను మామిడి కొమ్మల
వలపుల పాటల మలుపులు తెలిపిన చందమె అందం
కలువలు రమ్మనె కమ్మని విందుల కానుక ఇమ్మనె
వేకువ వెలుగుల మురిపపు కౌగిలి బంధమె అందం
సిరిసిరి మువ్వల సవ్వడి చేసెను ముదితల అందెలు
నడుమున కడవల నడకల నర్తన సందడె అందం
మదిలో దాచిన మమతల కదలిక కవితగ మెరిసే
కలసిన కన్నుల విరిసిన కాంతుల “విజయమె అందం