గజల్. విజయ గోలి
వెండిపూల రంగులలో వెలుగునీదె బంగారం
పసిడిరంగు పట్టుకురుల జిలుగునీదె బంగారం
మేలిముసుగు తీసిచూడు చిన్నపోద చందమామ
నిశిరాతిరి మెరుపుతీగ సొగసునీదె బంగారం
నినుపొందిన భాగ్యశాలి ఎవరొగాని చిన్నదాన
అప్సరసలె ఈసుచెందు తళుకునీదె బంగారం
పురివిప్పిన మయూరాల చెణుకుల కేముందిలే
చూపులాపి మదిదోచు సోకునీదె బంగారం
గ్రంధమైన ప్రబంధమైన కవనంలో “విజయా” నివి
అక్షయమౌ నీఅందం ఇగిరిపోదె బంగారం