విజయ గోలి. గజల్
నేలతడిపిన చినుకులెపుడో ఆరిపోయే కళ్ళముందే
గుండెనవ్విన గురుతులక్కడె ఆగిపోయే కళ్ళముందే
మోడువారిన చెట్టుపైనా చిగురులెక్కడ పలుకరించు
చిన్నపోయిన చిలుకలన్నియు చెదిరిపోయే కళ్ళముందే
మలిగిపోయిన మమతలింకా మళ్ళిరావులే మార్గమందు
ఎదురుచూపులు వెన్నుతట్టుతు వెళ్ళిపోయే కళ్ళముందే
కనికరించని కలతలన్నియు కావ్యమాయె కాలమందున
కనులనిలిచిన కలల రూపం కరిగిపోయే కళ్ళముందే
కొడిగట్టినది రంగుల షమ్మా వెంటరాని వెలుగునొదిలీ
కనులకొసలన నీటిచుక్కగ జారిపోయే కళ్ళముందే