గజల్ విజయ గోలి
వికసించిన మందారం విరుపులాయె మానసమే
అందాలతొ బంధించే వలపులాయె మానసమే
కలగన్నవి కాంచనమై కనులముందు నిలిచినవే
కళ్యాణమే కమనీయపు తలపులాయె మానసమే
తెరచాటున ఓరచూపు మధురూహల మందసమే
చూపులతో విరితూపుల జల్లులాయె మానసమే
మధుపర్కపు చిన్నెలలో పసిడిరంగు మెరిసినదే
మూడుముళ్ళ తాకిడిలో వెల్లువాయె మానసమే
తలంబ్రాల తళుకులలో తొలకరులే కురిసాయిలె
కొంగుముడుల కోలాటపు కొలువాయే మానసమే
ఏడడుగుల నడకలలో మునివేళ్ళ ముద్దులతో
ఎదలోపల పులకింతల పువ్వులాయె మానసమే
అంబరాన కురుస్తున్న ఆశీసుల అక్షింతలు
అవనిఅంత గెలుచుకున్న “విజయ”మాయె మానసమే