విజయ గోలి ..గజల్
మలిపొద్దున తొలికిరణం మెరిసినదీ కొత్తగాను
మల్లెపూల మత్తుగాలి వీచినదీ కొత్తగాను
మరలివచ్చి వసంతమే కోయిలలై కూసినదే
కలలమెలిగి కాలమంత కరగినదీ కొత్తగాను
ఆశపడే ఊసులకు. అందలమే హద్దుగా
సరిగమలై ఎదవీణలు మీటినదీ కొత్తగాను
ఎగిసిపడే అలలపైన విరిసినదే వెన్నెలమ్మ
తలపులతో జాబిలమ్మ తడిసినది కొత్తగాను
వేచివున్న వాకిటిలో వెలుగురేఖ విజయమాయె
చెలిమివచ్చి కలిమిగానె నిలిచినది కొత్తగాను