తరువు వీడి విరులు జారు

విజయ గోలి. గజల్

తరువువీడి విరులుజారు కోరకనే
విరులకొరకు కురులుజారు జారకనే

వనితలోని వన్నెతెలియ చిన్నెలివే
ఓరకంట చూపుజారు చూడకనే

వాలుజడల వయ్యారం నడకలలో
వలపుగదుల తలుపుతీయు తీయకనే

సందెవేళ సరాగాలు చెక్కిలిపై
చల్లగాలి కొంగుతాకు తాకకనే

పూమాలిక సంబరాల ముంగిటిలో
చిరునవ్వుల సైగచేయు చేయకనే

పలుకులలో పరిమళించు మధురిమలే
మౌనమెనుక మాటతెలుపు తెలుపకనే

పరవశాలు “విజయ”ములే తలపులలో
మదిలోతులు కొలవలేవు కొలువకనే

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language