*జలతారు వెన్నెల* విజయ గోలి
పున్నమి జాబిల్లి నవ్వులో..
జాలువారింది …జలతారు వెన్నెల
పిల్లగాలితో …చెలిమి చేసింది
మేలిముసుగును తాకి ..మేలమాడింది
ప్రియుని మదిలోన మోహాలనే.. కోరి పిలిచింది
మల్లెపూవులపై మత్తుగా ..తడిమింది..
కొలనులో కలువలతో ..స్నానాలు చేసింది
పొగడపూవుల పొదరిళ్ల ..సందడే చేసింది
అలసి సోలిన కళ్ళకు …జోలలే పాడింది
చెట్టు పై పిట్టలతొ .చుట్టరికమే కలిపింది ..
పారిజాతపు …జల్లులలో జలకాలు ఆడింది
పున్నాగ పువ్వులతో ….కలసి మెరిసింది..
తుంటరిగ కోయిలను ..తట్టి లేపింది..
స్వరమునే సరిచేస్తు ..రాగాలు పాడగా..
తుళ్ళిపడి ..లేచింది ..గండుకోయిల..
పక్కున నవ్వింది.. పండువెన్నెల ..పిండారపోస్తూ..
వనమంత కలతిరిగి వలపు సవ్వడి చేసింది..
తూరుపుకనుమల్లో ఎరుపు చూసింది…
మరలి వస్తానంటు ..వెండిమబ్బుల మాటు
మాయమైపోయింది…మంచు వెన్నెల …..