శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
వలపు తలపు మల్లెలతో మాటాడితె గజలియత్
గుబులు గుండె గొంతుకలో కొట్లాడితే గజలియత్
అలుపు లేని బాల్యంలో అమ్మపిలుపు మధురిమలే
వలస పోని ఆమనిగా మురిపిస్తే గజలియత్
చూపులతో చూపుకలసి చుట్టమైన చెలిమొక్కటి
కలల కడలి అలల తేలి ఆటాడితె గజలియత్
వలలోపల విలవిలలో వినిపించని రాగాలే
వెల్లువెత్తి వేదనగా శోధించితె గజలియత్
అనుభవాల అలమరలో దాచివున్న చిత్తరువులు
ఇంద్ర ధనువు రంగులలో విప్పారితె గజలియత్
ఎద కదిలిన సొద రగిలిన మది మెదిలే తరంగాలు
అక్షరాల పరిమళమై హృది మీటితె గజలియత్
సయోగమో వియోగమో విజయాలో అపజయాలొ
అనుభూతుల జ్ఞాపకాలు అలరిస్తే గజలియత్