శుభోదయం 🌹🌹🌹🌹🌹
సోదరులు శ్రీ రామ గోపాల్ గారు ఆత్మీయంగా నా తొలి గజల్ సంపుటి “పిల్లనగ్రోవి “ పై చేసిన అందమైన సమీక్ష
నవ మల్లె తీగ మాస పత్రికలో ప్రచురించిన సందర్భంగా
సోదరులు శ్రీ రామ గోపాల్ గారికి నవ మల్లెతీగ సంపాదకులు శ్రీ కలిమి శ్రీ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
“అలరించిన ఆనంద హేళి “
విజయ గోలి గారి “పిల్లన గ్రోవి “ గజళ్ళ సంపుటి
“పిల్లన గ్రోవి “
ఇహ పర బంధాలను మరపిస్తూ మాయా మోహాలనుండి
దూరంగా …చాలా దూరంగా ..విశ్వాన్ని భగవంతుని పాదారవిందాలకు దగ్గరగా తీసుకు వెళ్ళ గలిగే సమ్మోహనాస్త్రం మాధవుని వేణు గానం .
మాధవుడే మనో నాధుడై మైమరపించే రసరాగం . ప్రఖ్యాత చిత్ర కారులు శ్రీ కూచి గారు చిత్రించిన శ్రీకృష్ణుడి ముఖచిత్రం ప్రత్యేక ఆకర్షణగా జీవం పోసుకుంది .అలాగే ప్రఖ్యాత గజల్ కవులు ,కవయిత్రుల అతిశయోక్తి లేని ముందు మాటల తో ఎంతో అందంగా ఆవిష్కరించ బడిన గజల్ సంపుటి .
ప్రతి గజల్ కు ప్రాణం పోసే చిత్రాలతో “పిల్లన గ్రోవి” ఒక మధుర కావ్యంగా మనసుకు స్ఫురిస్తుంది. రాధా మాధవ సాన్నిధ్యాన్ని కళ్ళకు కట్టి నట్లు రచించారు . ఇందులో ఇంకొక విశేషం …గోపాలుడికై ఎదురు చూసే రాధను అష్ట విధ శృంగార నాయిక గా గజల్ ప్రక్రియ లో ఎనిమిది గజల్స్ ను సృజియించటం అద్భుతం .పాఠకులు చదివితే గాని ఆ మధురతను ఆస్వాదించ లేరనేది నిజం .శ్రీమతి విజయ గోలి గారు వ్రాసిన ఈ “పిల్లనగ్రోవి “
పాఠకులను ఆనందానుభూతి తో నింపటం అక్షర సత్యం .
గ్రాంధిక పదాలతో గజళ్ళను సృష్టిస్తే పండితులకు మాత్రమే చేరువవుతుంది. ఈ గజళ్ళు మాత్రం వ్యవహారిక భాషలో రాసి అందరి మనసులకు జేరి మన్ననలు పొందుతోంది.
లలితమైన అలతి పదాలతో రాసి అక్షరాలను ప్రేమతత్త్వంలో ముంచి భావగర్భితమైన అర్ధాలను పంచి తనకంటూ ఒక ప్రత్యేక మైన శైలిని నిలుపుకున్న గజల్ కవయిత్రి శ్రీమతి విజయ గోలి గారు. తేలికైన పదాలు, లోతైన భావాలతో సాహితీ ప్రియులను కట్టి పడేయడంలో దిట్ట .నిబద్దత కలిగిన కవయిత్రి.
కృష్ణుని ప్రేమతత్వంతో నిండిన “పిల్లనగ్రోవి “గజళ్ళు చదువుతున్నంత సేపూ కలిగే అనుభూతి అనిర్వచనీయం.
ఒక్కసారి అలా …కొన్ని గజళ్ళను పలకరిద్దాం.
“కలికి నవ్వులు” అనే గజల్ లో
“కనులు మూసిన కలికి నవ్వులు ఏటిగాలుల ఎగసి వచ్చె
మువ్వసవ్వడి ముందుగానే గువ్వపలుకుల ఎగిరివచ్చె”
ఏటి ఒడ్డున నిలుచుంటే ఆ నీటిపై నుండి వచ్చేగాలులు సుతారంగా తాకినపుడు కలిగే ఆనందం వర్ణనాతీతం .వెనుక నుండి వచ్చి తన కనులు మూసిన రాధ అలికిడిని కన్నయ్యకి …కలికి నవ్వుల సవ్వడి ఏటి గాలి తెలియ చేసిందనటం ..పాదాల మువ్వల సడి ..గువ్వ తన పలుకులతో ముందే చెప్పింది అనటం …ఎంత మధురమైన అభివ్యక్తో ఆలోచించండి
చదివినంత సేపు మనది కాని అలౌకిక ప్రపంచం లో విహరిస్తాం ..
“మల్లెలార”లో
“మల్లెలార మౌనమేల పిలిచినాడు మాధవుడే”
మొల్ల లార జాగేలా తలచి నాడు మాధవుడే
ఇక్కడ మల్లెలు , మొల్లలను ప్రేమ వస్తువుగా వాడటంలో ఆమె చమత్కారం కనిపిస్తుంది…ఈ గజల్ లో పూబాలలన్నిటినీ తమ సోయగాలతో వేణుగోపాలుని ఆహ్వానించటం ఎంతో బాగుంది .మాధవుడు తలుచుకోవటం అంటే మాటలు రాని పరిస్థితి …పద మంటూ
పూవులను తొందర చేయటం .అనిర్వచనీయం .
.మల్లెలు మాట్లాడవు గానీ ప్రేమగా చూస్తే పలకరిస్తాయి, పరిమళిస్తాయి కదా అని కవయిత్రి ఆంతర్యం అని నా అభిప్రాయం .
“దరహాసం”
ఈ గజల్ లో రాగాలతో పిల్లనగ్రోవి ని రవళించారు కవయిత్రి
మత్లా :”నీ తలపున మోహనమై విరిసెనులే దరహాసం
నీ వలపుల కళ్యాణిగ మెరిసెనులే దరహాసం “
“ఉషోదయపు భానుడితో భాసిల్లిన భూపాలం
హిమచందన తుషారాలు చిలికెనులే దరహాసం”
ఇలా మోహన,కళ్యాణి,భూపాలం,కీరవాణి,హిందోళం,నీలాంబరి రాగాలతో
సమ్మేళన పరుస్తూ వ్రాసిన ఈగజల్ న భూతో న భవిష్యతిః అని చెప్ప వచ్చు .
ఇంతకన్నా మంచి వర్ణన ప్రకృతిలో ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి కనులు మూసుకొని ఆ అనుభూతిని ఆస్వాదించండి, మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటలలో చెప్పలేం.
ఒక వేడుక”
“మూసివున్న కన్నులలో దాగివుండి ఒక వేడుక
విచ్చుకున్న పెదవులపై వేచివుంది ఒక వేడుక”
ఈ గజల్ లో ఆత్మసౌందర్యం, బాహ్య సౌందర్యం గురించి రాసిన తీరు, ఆ వాక్యాలలోని గొప్పతనాన్ని, అందమైన గోప్యతను వర్ణించిన విధానం రచయిత్రి ని ప్రశంసించవలసిందే.
“ఎదురుచూపు”
“ఇరు సంధ్యల అందాలలో సింధూరపు వన్నెలతో”
సూర్యోదయం, సూర్యాస్తమయంలో కనిపించే అందమైన సింధూరపు వర్ణం గురించి వర్ణించడం చాలా క్లుప్తంగా అర్ధవంతంగా చెప్పడం అభినందనీయం
“చిత్తమందు చిలిపి ఊహ”
“చిత్తమందు చిలిపివూహ ఉత్తరమే వ్రాయమంది
చిరుగాలుల అల్లరేదో చిత్తరువే గీయమంది”
ఊహల్ని భాషగా రాయాలని, అల్లరిని చిత్రం గీయాలని అంటే ఇక్కడ భావాలను వ్యక్తపరచడాన్ని కవయిత్రి లౌక్యంగా తెలియచేయడం అని అర్ధం.
“కనులు మూసి తలచితివా”
“కనులు మూసి తలచితివా నీ కలలో నేనుంటా
మనసు తట్టి పిలిచితివా మాటలలో నేనుంటా”
ప్రేమలో వున్న గొప్పతనం ఏమంటే దగ్గరితనం కనిపిస్తుంది, నాది అనే భావన కనిపిస్తుంది, పిలిచినట్టే ఉంటుంది, మన గురించే ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. అదే కదా కృష్ణతత్త్వం
“శుభలేఖ”
“కనురెప్పల కుంచెలతో వర్ణలేఖ వ్రాస్తున్నా
ప్రణయాలే పల్లవిస్తూ ప్రేమలేఖ వ్రాస్తున్నా”
ఎంత మధురమైన ఊహ ఇది, దీని గురించి ప్రత్యేకంగా ఏమీ రాయనవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇది చదవగానే మన మనోఫలకంపై ముద్రణ అయిపోయింది కదా.
వెదురు పుల్ల ,వ్యాహ్యాళి,వెలుగు దారి , తలపే వుంటే ,కనుల నిండ నీరూపం
50 గజల్స్ ..దేనికదే ప్రత్యేకమైనదిగా మలచ పడ్డాయి .
ప్రతి గజల్ రసరమ్యంగా మురళీనాదంలా మనసుకు హత్తుకుంటాయి .
ఈ కావ్యం లోని అష్ట విధ నాయికల సృజన ..మాటలకందనిది . ఒక్క సారి పలుకరించి చూడండి ..వినూత్నమైన ఆనందం మనసు నింపుతుంది .
“ చెక్కిలి పై చందనాలు చిలుకుతానె చిలిపిగాను
పడకటింటి పరిమళాల వలపు నింపు నిన్ను జేరి” స్వాధీన పతిక
“విరహాలా ఎద సవ్వడి వినవేలా యదుపాలా
మది నిండుగ నీరూపమె కొలువాయెలె గోపాలా “
విరహోత్కంఠిత గా …అన్ని గజల్స్ లోను అద్భుతమైన పదజాలంతో
మనసును ఉవ్విళ్ళూరిస్తుంది .
ఇలా నేను 50 గజళ్ళ లో కొన్నింటిని మాత్రమే తీసుకుని వాటిలో ఒకటి రెండు వాక్యాలలోని అర్ధాలను చర్చించుకుంటేనే చెప్పలేనంత మధురానుభూతి కలిగింది కదా! అలాంటిది అన్ని గజళ్ళనూ చదివితే అతిశయోక్తి లేని మంచి అనుభూతిని ఇవ్వగలదు ఈ పిల్లనగ్రోవి
కృష్ణతత్త్వం, ప్రేమతత్త్వం కలిగిన ఈ పిల్లనగ్రోవి గజళ్ళు తెలుగుహృదయాలలో చిరస్థాయిగా నిలుస్తోంది అని ఘంటాపదంగా చెప్పగలను. సాహిత్యాభిమానులకు 50 అక్షర పుష్పాలతో 50 గజళ్ళ గజమాలలు అందించిన శ్రీమతి విజయ గోలి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ మరెన్నో రచనలు ఆమె కలం నుండి జాలువారి పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలవాలని కోరుకుంటూ
మీ
రామగోపాల్ కొమ్ముల
పెదపట్నంలంక
8886501012