మిత్రులందరికీ మకర సంక్రాంతి మరియు కనుమ
పండగల శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పాడిపంటల పౌష్యలక్ష్మి పసుపురాశుల స్వాగతాలే
పచ్చగడపల పసిడిరంగుల ముద్దబంతుల స్వాగతాలే
ముగ్ధ లేసెడి ముగ్గులందున గొబ్బిపూవుల గొబ్బెమ్మలే
హరిదాసుల సంకీర్తన సుప్రభాతపు సుస్వరాలే
గంగిరెద్దుల ఆటపాటలు ఆదరింపుల పలకరింపులు
సందెగొబ్బెల సందడులలో కన్నెపడుచుల సోయగాలే
భోగభాగ్యం భోగిమంటలు కొత్తబెల్లపు తీపిరుచులే
బొమ్మలకొలువు భోగిపళ్ళలొ బోసినవ్వుల సంబరాలే
పల్లెఅందం రాశిపోసిన తెలుగువెలుగుల సంక్రాంతి లో
నవ్వుతాయిలె సందెపొద్దుల అనుబంధాల కదంబాలే
ఇంటివేలుపు. బసవడంటూ కనుమపూజలు కనులవిందులు
అలల ఆశల ఆటలాడే గాలిపటాల ఆశయాలే
మకరరాశిన సూరీడొచ్చె మంచిరోజులు *విజయమేలే
నిత్యనూతన సంక్రాంతులుగ నిలవాలి ఇల సంతసాలే