కను రెప్పల

కనురెప్పల నెమలీకలు తడిమినట్లు కల గన్నా
కాగితాల పడవలపై కదిలినట్లు కల గన్నా

చిరునవ్వుల సవ్వడిలో చిరుమువ్వలు రవళించిగ
నింగికెగిసి నెలవంకను తాకినట్లు కల గన్నా

చుక్కపూలు త్రుంచుకోని శిగపాయల తురిమినట్లు
వేయి మధుర వేణువులే మ్రోగినట్లు కల గన్నా

కొమ్మలలో దూరిపోయి గువ్వగూడు చేరిపోయి
కూనలలో పసికూనగ ఆడినట్లు కల గన్నా

తూనీగల తరుముకుంటు తరువులెంట తప్పిపోయ
కొండకోన ఓయంటూ పిలిచినట్లు కల గన్నా

అంబరాన అమ్మాయిలు అస్త్రాలతొ ఆటాడగ
గజరాజులు విజయాలనె పలికినట్లు కల గన్నా

తొలిఝాముల కలలెపుడూ నిజమగును ఇలలోనా
విశ్వమంత ధవళకాంతి విరిసినట్లు కల గన్నా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language