సాయం. విజయ గోలి

సాయం

అమ్మాఅంటూ వీధి వాకిట్లో పిలుపు  వినగానే. మాకు అన్నం పెడుతున్న

అమ్మ   కొంచెంగా తటపటాయించింది .

ఎండాకాలం పొద్దునెపుడో అమ్మ కలిపి పెట్టిన కాస్త చద్దన్నం తిని వెళ్ళామా ఒంటి పూట బడులు  కావటంతో  ఆకలి ఆవురుమంటూ వడిలిన ముఖాలతో  ఎండన బడి రావటం అమ్మ బాగా కదిలి పోయింది.మా ముఖాలు చూడగానే  మమ్మల్ని కాళ్ళుకడుక్కు రమ్మని గబ గబా  కంచాల్లో అన్నం పెడుతుంది .అందరంవచ్చి  పీటలు వేసుకుని  ,మంచినీళ్ల గ్లాసులు పెట్టుకుని ,అమ్మ పెట్టిన అన్నం కంచాలు తెచ్చుకుని  తినటానికికూర్చున్నాం . మా ఎదురుగా అమ్మ  గిన్నెలన్నీ  పక్కన పెట్టుకుని  ఎదురుగా పీట మీద కూర్చుని మాకుకావలసినవి వడ్డిస్తుంది .అది మామూలుగా రోజూ జరిగే విషయం .మూడు రోజులుగా ఇదే  సమయానికి  పిలుపు .

అందరం అమ్మ వంక తలెత్తి చూసాం .

అమ్మ ముఖంలో  చాలా అసహనం

పెరట్లోకి రాఅని బదులిచ్చింది.

ఏంకావాలి రా మీకు అంటూ తన వంకే చూస్తున్న మా వైపు తిరిగింది .

పెరటి లో చిన్న పిల్లవాడి సన్నని ఏడుపు గొంతు వినపడుతుంది .

మేము అన్నం తిని హాల్లోకి వచ్చాము .

కొట్టు కోకుండా  ఆడుకోండి  అని చెప్పి  కొంత అన్నం కూర ఒక పళ్లెంలో  పెట్టుకుని  పెరటిలోకి వెళ్లింది .

అక్కడ చెట్టు క్రింద  జిబ్బి  నెత్తితో  మురికిగా స్నానం మరిచి పోయి నెలలు దాటిందేమో అన్నట్లుగా వుంది .

చినిగి పోయిన చీరకు ముళ్ళు వేసుకుని ఒళ్ళు  కప్పుకోవటానికి శత ప్రయత్నం చేస్తూ 2సంవత్సరాలు లోపు  పిల్ల వాణ్ణి ఒళ్ళో పెట్టుకున్న కూర్చున్న 20 లోపు వున్న యువతి పక్కన సత్తు గిన్నె పెట్టుకుని తలవంచుకుకూర్చొని వుంది .

సత్తు గిన్నెలో అన్నం కూర  వేసి ఒక చెంబుతో. నీళ్లిచ్చిలోపలికి వచ్చి ఒక చిన్న గాజు   గ్లాసులో పాలు పోసితీసు కెళ్ళి  గట్టు మీద పెట్టి

వాడికి తాగించు అంది .

తల పై కెత్తి ఆమె కళ్ళ ల్లో  నీళ్ళు నిండు తుండగా అమ్మ వంక చూస్తూ తలవూపింది.

చేతులు కడుక్కుని అన్నం తిను .అంటూ  వెనక్కి తిరిగింది అమ్మ

వెనకాలే తలుపు దగ్గర నిలబడి వున్న నన్ను చూసి

నువ్వేంటి ? ఇక్కడ అంటూ గట్టిగా గదిమింది.

అంతే లోపలికి వెళ్ళి పోయాను. బహుశా అపుడు నాకు ఎనిమిది ,తొమ్మిది సంవత్సరాలు వుండ వచ్చు. అమ్మ చేసే పనులను చూడటం చాలా ఇష్టంగా వుండేది.

రెండు  రోజుల క్రితం  ఇలాగే అన్నం తినే సమయానికి

అమ్మా ! ఆకలిగా వుంది కాస్త అన్నం పెట్టమ్మా ! గొంతులో ఆకలి ప్రతి ధ్వనిస్తుంది.

పైకి వెళ్ళి రా   అని చెప్పాలనుకుని నోరు తెరిచింది కానీ చెప్ప లేదు .

అమ్మ చేయి వీలుగా లేక పోతే వచ్చే ముష్టి వాళ్ళకి  అలాగే చెప్పేది. కానీ అమ్మ పళ్ళెం లో కాస్త అన్నం కూరవేసి తీసుకెళ్లింది .

కొంచెం నీళ్ళివ్వండమ్మా అన్న అవతలి గొంతు .

నీళ్ళు ఇచ్చి వచ్చిన అమ్మ ముఖంలో కోపం బాధ  కొట్టవచ్చినట్లు కనుపించింది .

కొద్ది సేపు తర్వాత  అమ్మాయి  వెళుతూ

అమ్మా చెంబు గుమ్మంలో పెట్టాను అని చెప్పి వెళ్ళి పోయింది .

రోజంతా అమ్మ చాలా అన్య మనస్కంగా వుంది .

ఇక్కడ కొంత అమ్మ గురించి చెప్పాలి .

అమ్మ వ్యక్తిత్వం చాలా నిబద్ధతగా ఉండేది .ఆవిడ అభిప్రాయాలు నిర్దిష్టంగా  స్పష్టంగా వుండేవి . నాటికిమా అందరికీ స్ఫూర్తి మా అమ్మ .ఇలా చెప్పటం మాకు చాలా గర్వంగా ఉంటుంది . రోజులలోనే మహిళాసమానత్వాన్ని గురించి మాట్లాడేది.

అమ్మ పెళ్ళి  జరిగే నాటికి ఎనిమిదవ తరగతి  చదువుకుంది  .అప్పట్లో ఆడపిల్లలకి అది  గొప్ప చదువు.తాతయ్య సొంత వ్యవసాయం చేసేవాడు .అమ్మమ్మ  ఆరోజుల్లో ఇల్లాలు లాగే  పిల్లలు ఇల్లు అన్నట్లుగావుండేది .వాళ్ళకి  ముగ్గురు మగపిల్లలు  ముగ్గురు ఆడపిల్లలు .అందరికన్నా పెద్ద ఆడపిల్ల ,ఆతర్వాత ఇద్దరుమగపిల్లల తర్వాత అమ్మ ఆతర్వాత ఒక ఆడపిల్ల , ఒక మగపిల్ల వాడు .పెద్దామెకు చిన్నప్పుడే పెళ్ళి జరిగింది  ఆతర్వాత అమ్మ పెద్దన్న స్కూల్ ఫైనల్  (SSLC) చదివాడు .వాళ్ళ ఊళ్ళో వున్న పసుపు ఫ్యాక్టరీ లోమేనేజర్‌గా చేసేవాడు.స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొనేవాడు .మంచి పుస్తకాలు అమ్మ చేత చదివించేవాడంట. రెండో అన్న ఏదో కొద్ది పాటి చదువు తో ఆపి తాతయ్యకు వ్యవసాయం లో సాయం చేసేవాడని . ఆయన ఉద్యమ కారులకు  వేగు (ఇన్ఫార్మర్)గా పని చేసేవాడని ,ఎక్కడో అడవుల్లో  బ్రిటిష్ వాళ్ళు కాల్చేసేంతవరకు ఎవరికీ తెలియలేదంట. తర్వాత అమ్మ  .

.ముందు నుంచి చాలా తెలివైన దానిగా పేరు ..తెల్లగా సన్నగా  పొడవాటి నల్లని జుట్టు ,చక్కటి కనుముక్కుతీరు  , అందరితో స్నేహంగా చలాకీ గా వుండేదంట .అమ్మ పేరు చిన్నమ్మి .పెళ్ళి అయినాక  అమ్మ పేరుజానకిగా మార్చారట . 12 సంవత్సరాలకే పెళ్ళి చేయాలని తాతయ్య పట్టు పట్టినా  అంత కన్నా గట్టిగాచేసుకోనని  నేను చదువు కోవాలని ఎదురు తిరిగిందట . చేసేదేమి లేక చిన్న కూతురిని  మేనల్లుడికి ఇచ్చిచేసి చిన్న కొడుకు చదువు మీద శ్రద్ధ పెట్టారంట .తాతయ్య వాళ్ళ ఇంటికి ఎదురుగా  అమెరికన్ హాస్పిటల్ఉండేదట.

అక్కడ అందరూ నన్స్(అమ్మగార్లు)  పనిచేసే వాళ్ళనీ అమ్మ తరచూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి  కుట్లు ,అల్లికలు.ఇంగ్లీషు నేర్చుకునేదనీ ,రోగులకు వాళ్ళు చేసే సేవలు చాలా ఇష్టంగా చూస్తూ ,తను కూడా అప్పుడప్పుడువాళ్ళకి సహాయం చేసేదట. వాళ్ళందరికీ అమ్మంటే చాలా ఇష్టంగా వుండేదట.

ఒక్క రోజు అమ్మ వెళ్ళక పోయినా వాళ్ళే  ఇంటికి వచ్చే వాళ్ళని

అమ్మ గూర్చిన వివరాలన్నీ తాతయ్య చెప్పేవాడు .

ఇది చూస్తున్న తాతయ్యకి  అమ్మ అమ్మగార్లలో చేరిపోతుందేమో అని భయమేసిందట. నయానా భయానా  చెప్పి మొత్తానికి అమ్మను పెళ్ళికి ఒప్పించారట. అప్పటికి అమ్మకి 14 సంవత్సరాలు .

అత్త గారింట కూడా ఆమెదే ప్రాధాన్యత. ఇంటి పెద్ద కోడలు . అందులోను చదువుకున్న కోడలు .

నానమ్మకి ముగ్గురు మగపిల్లలు , ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి

అయిపోయింది .తాతయ్య పోవటం వలన కుటుంబ బాధ్యత నాన్నదే , పెద్ద బాబాయి నాన్న అన్నీచూసుకునే వారు.వ్యవసాయము వ్యాపారాలు వున్న కుటుంబము కాబట్టి ఆర్ధికమైన సమస్యలు లేవు .

ఇంక చిన్న బాబాయి స్కూల్ ఫైనల్ చదివి  స్వాతంత్ర్య ఉద్యమంలో తిరిగే వాడు . అమ్మంటే ఆయనకు చాలాగౌరవం. దేశం లో జరుగుతున్న విషయాలన్నీ అమ్మకు చెప్తుండే వాడట. చేతితో వ్రాసిన పత్రికలు  చదవటానికి అమ్మకిచ్చే వాడట.

ఇవన్నీ నాన్నకు తెలియకుండా నానమ్మ, అమ్మ బాబాయిని కవర్ చేసేవారట. నాన్నకు అన్నీ తెలుసుఅయినా తెలియనట్లే వుండేవారట. పత్రికలు దొంగతనంగా ఆయన కూడా చదివేవాడట.

స్వాతంత్ర్యోద్యమ సమయం లో యువత నాయకుల స్పూర్తి తో  నిస్వార్ధంగా బయటికి వచ్చేవారని.ప్రతి ఇంటినుండి ఒకరు తప్పని సరిగా ఉద్యమంలో ఉండేవారని అమ్మచెప్పేది .ఎంతో మంది నిస్వార్థ సంఘటిత  సంకల్ప బలానికి ఫలితమే మన దేశ నాటి స్వాతంత్ర్యం.

ఈనాటి యువత పోకడలను చూస్తున్నపుడు దేశ ప్రగతి దిక్కు నడుస్తుందో

తెలియని అగమ్యగోచర పరిస్థితి . కధ దారి మళ్ళుతుంది కదా !

విషయానికి వద్దాం . అలాంటి వాతావరణం లో పెరిగిన అమ్మకు అన్నీ అభ్యుదయ భావాలే. ప్రేమ దయ నీతినిజాయితీ  స్నేహం ఆమె వ్యక్తిత్వం .అలాగే అమ్మకి కోపం కూడా ఉండేది.అది పాల పొంగు .

పై సందర్భం జరిగే నాటికి  అమ్మకు తొమ్మిది మంది పిల్లలు ,పెద్దన్నయ్య  సంవత్సరమే కాలేజీకి వచ్చాడు.పెద్దక్క స్కూల్ ఫైనల్ ,చిన్నక్క ,రెండో అన్నయ్య  హై స్కూల్  .చిన్నన్నయ్య  , నేను  నా తర్వాత చెల్లి  తమ్ముడుఎలిమెంటరీ స్కూల్ .ఆఖరి చెల్లెలు బాగా చిన్నది. సంసారం పెద్దవటం ,బాబాయిలు పెళ్లిళ్లు అవటం  ఇల్లుచాలక పోవటంతో వేరు పడటం జరిగింది .అది పేరుకు మాత్రమే .

మేము వుండే ఇల్లు చాలా పెద్దది .చాలా పెద్ద పెరడు  పెరటి నిండా చెట్లు పెద్ద చింత చెట్టు ,నారింజ  ,బాదం  ,బొప్పాయి ,అరటి చెట్లు,కూరగాయలు , ఆకు కూరలు  ,రకరకాల పూల చెట్లు చాలా బాగుండేది.పెద్ద బావి కూడా వుండేది.

సరే ఇంక విషయ మేమిటో  చూద్దాం .

లోపలికి వచ్చిన అమ్మ  బట్టల అలమర లోనుండి  చిన్నక్క బట్టలు లంగా ఓణీ  జాకెట్ రెండు జతలు చిన్నచెల్లి  రెండు గౌన్లు, ఒక దుప్పటి తీసి పక్కన పెట్టింది . అమ్మ మళ్ళీ పెరటిలోకి  వెళ్లింది .అప్పటికే అమ్మాయిపిల్లవాడికి పాలు తాగించి . సత్తు గిన్నెలో అన్నం  కొంత తిని కొంత మిగిల్చి వుంచుకుంది .

అమ్మ వంట గది మెట్టు మీద కూర్చుంది .నేను అమ్మ వెనకాల  దూరంగా  నిలుచున్నా. అమ్మ ఏమిమాట్లాడుతుందో వినాలని .

నీ పేరేమిటి ? అమ్మ

సంపూర్ణతలెత్త కుండానే సమాధాన మిచ్చింది అమ్మాయి

వూరు ?అమ్మ

మద్రాసు ..సంపూర్ణ

అక్కడ నుండి ఇక్కడికి  ఎందుకొచ్చావు ? మీ వాళ్లెవరూ  లేరా?

అడిగిన దానికి జవాబు చెప్ప లేక కళ్ళ నిండా నీళ్ళ తో తలెత్తింది.

వెంటనే అమ్మ ప్రశ్న మీద ప్రశ్న వేసింది.

మీ ఆయనే మయ్యాడు ?ఇలా అడుక్కోవటం నీకు సిగ్గు అనిపించటం లేదా !

ఏదైనా పని చేసు కోవచ్చు కదా! అమ్మ కాస్త గట్టిగానే అంది .

అమ్మాయి కళ్ళ వెంట నీరు కారుతున్నాయి .అమ్మ వంక చూస్తూ  మింగుకుంటున్న బాధనంతా  గొంతులోఅడ్డు పడింది.

గొంతు పెగుల్చుకునిఅడుక్కోవటం చాలా బాధగా వుందమ్మా! పిల్ల గాడు , మా అప్ప లేకపోతే నేను  ఎపుడో చచ్చి పోయేదాన్ని .

మా అప్పకు కళ్ళు కనుపించవు .ఎక్కడ పని అడిగినా ఎవరూ ఇవ్వటం లేదమ్మా  అరవ యాసతో  చెప్పింది .

ఇక్కడికి ఎలా వచ్చారు ? ఎందు కొచ్చారు?  అమ్మ

మా అప్పకి, అమ్మకి  నేనొక్క దాన్నే నమ్మామా అప్ప  కారు షెడ్డులో పని చేసేవాడు .మా అమ్మ ఇళ్ళల్లో  పనిచేసేది . నేను 5 వతరగతి దాకా చదువుకున్నానమ్మామేము బాగానే వుండే వాళ్ళం .

నాకు పెళ్లి చేసారు. మా ఆయన కూడా మాతోనే వుండేవాడు.ఏదో కూలి చేసి డబ్బులిచ్చేవాడు . ఈడుకడుపున పడ్డ కొద్ది రోజులకి ఎటో వెళ్ళి పోయాడు . ఎంత వెదికినా తెలియలేదు .మా అమ్మ అప్ప ఏడవనిరోజులేదు . ఆసమయం లోనే మా అప్పకి  వెల్డింగ్ చేస్తున్నపుడు కళ్ళు పోయినాయి .కష్టాలన్నీ మాకేవచ్చాయని ఏడ్చుకునేది మా అమ్మ .ఐనా ధైర్యంగా నన్ను మా అప్పని బాగానే చూసుకొనేది .వీడు పుట్టినఏడాదికి  గుండె పోటొచ్చి చచ్చి పోయింది. ఏం చేయాలో  ఎలా బతకాలో తెలియలేదు .మా అమ్మ చేసే ఇళ్లల్లో పని చేద్దామని వెళ్లాను .వాళ్లు వద్దన్నారు .ఇంటి  అద్దె కట్ట లేదని  ఇంట్లోనుండి వెళ్ళిపొమ్మన్నాడు  షావుకారు ..ఏమి చేయాలో తెలియ లేదు ..ఇరుగు పొరుగు ఎవరూ సాయం చేయలేదు. ఎవరో చెప్పారు  రైలు స్టేషన్ దగ్గరికి వెళ్లండి .అక్కడ ఏదో పని దొరుకుతుంది . మద్రాసు రైలు స్టేషన్ కి చేరాము.అంతమందిజనం  నేనెపుడు చూడలేదు. చాలా భయమేసింది .ఎవరో వెళ్తూ వెళ్తూ  మిగిలిన తిండి పెడితే   అప్పకి   పిల్లోడికి పెట్టి ఎవరైనా 10పైసలిస్తే. టీ తాగి అలా నాలుగు రోజులు గడిపాము .స్టేషనంతా  తిరిగాను పనిదొరకలేదు  . ఏమి తెలియ లేదు. ముగ్గురం చచ్చి పోదామప్పా అని ఏడ్చాను .

లేదమ్మీ ! పద రైలెక్కుదాం నాచేయి పట్టుకుని పిల్లాడిని ఎత్తుకుని  నువు ముందు నడువు .నేను చేయి జాపిఅడుక్కుంటా దయగల వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. స్టేషన్ సారు ఏడ దించితే ఆడ దిగి పోదాం. నామాటిను చావు మాటఎత్తకు. అది దేవుడు ఇయ్యాల అంటూ ఓదార్చి ఒప్పించాడు . అలా రైళ్ళల్లో స్టేషన్లలోకొద్ది రోజులు గడిచినాయి.

రాత్రైతే పోకిరీ గాళ్ళు నా చుట్టు నిలబడే వాళ్ళు .పొద్దు గూకుతుంటే భయం .

తెల్ల వార్లు అప్ప కర్ర పట్టుకుని మేలుకునే వుండే వాడు .అలికిడైతే అరిచి గోల చేసే వాడు .మనుషులమధ్యలో మధ్యలో తిరిగే వాళ్ళం చాలా మంది విసుక్కునే వాళ్ళు  దూరంగా  పొమ్మని కసురుకునేవాళ్ళు.సమయంలో  వున్న  నాలుగు బట్టల సంచీ ఎవరో కాజేసారు . మార్చుకోను  మారులేదు . సంపూర్ణ గొంతుపూడుకు  పోయినట్లైంది . పెగలటం లేదు .ఏడుపు మింగుకుంటుంది . పెగుల్చుకుని మెల్లిగా చెపుతుంది.కళ్లు ధారా పాతంగా కారుతున్నాయి .

అమ్మ కళ్ళు కూడా చెమ్మ గిల్లటం చూసాను .

దేవుడా ! మమ్మల్ని  మా అమ్మ దగ్గర చేర్చమని ప్రతి క్షణం మొక్కుకుంటూనే వున్నా. సంపూర్ణ ఏడుస్తూచెప్తుంది.

వూళ్ళో రైలు ఎక్కామో  తెలియదు ఎక్కడ దిగుతున్నామో తెలియదు ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. రకంగా ఒక రోజు పొద్దున్నే ఊరిలో దించేసారు .

పిల్లోడికి తేడా చేసింది .ఏమి చేయాలో తెలియ లేదు .భయం .స్టేషన్ లో వున్న  చిన్న దుకాణం లో ఒకపెద్దాయన కనిపించాడు  .దగ్గరికి వెళ్ళి నా గోడు చెప్పకున్నా పని మైన ఇవ్వమని అడిగాను .

నా దగ్గర పనేమి లేదు. ఊళ్ళో కెళ్ళండి ఏదైనా పని దొరుకుతుంది .అని పిల్లోడికి  పట్టమని  కాసిని పాలు ,ఒకబ్రెడ్డు ఇచ్చాడు . ఆరోజు గడిచింది  పిల్లవాడికి రెండు మందు బిళ్లలు  ఇచ్చాడు. దాంతో కుదుట పడ్డాడు. ఇంకొక రెండు రోజులు గడిచాయి.

నువ్వు ఇక్కడ ఎన్ని రోజులున్నా పనేమి దొరకదు.అడుక్కోవటానికి కూడా  ఇక్కడ ఎక్కువ మనుషులు దిగరు.ఇది చిన్న స్టేషన్ .నా మాట విని ఊళ్ళోకి వెళ్లండి అని గట్టిగా చెప్పాడు .చేసేది లేక ఎలా వెళ్ళాలో  ఎక్కడికివెళ్ళాలో అడిగాను.

మీ లాంటోళ్ళందరూ  పెద్ద గుడి పక్కనే  గాంధీ గారి మండపం వుంది  అక్కడ ఉంటారు ముందు అక్కడకివెళ్లండి ఉండటానికి నీడ దొరుకుతది  .అన్నాడు కొట్టు ఆసామి .

ఇక్కడ కొద్దిగా కధనుండి బయటికి వద్దాం.

స్వాతంత్ర్యం వచ్చాక  ప్రతి ఊరిలో గాంధీ గారి బొమ్మ తో గాంధీ మండపాలు స్వచ్ఛందంగా కట్టుకున్నారు .

ఒక శివాలయం  ఒక రామ మందిరం లాగా  ఊరుకొక గాంధీమండపం .

ప్రతి గాంధీ జయంతికి , ఆగస్టు 15 కి గాంధీ వర్ధంతికి  , రిపబ్లిక్  డే కి జెండా ఎగుర వేయటం , అన్న దానాలు, మిఠాయిలు పంచటం జరిగేది .

విడి రోజులలో ..అది బాటసారులకు  ఆవాసం గా  వుండేది .అక్కడ దిన పత్రిక లు ఉండేవి.ఉదయం కొంతమంది అక్కడ చేరే వారు .పత్రికలు తిరగ వేయటానికి .

అలా మాఊళ్ళో  గాంధీమండపం కూడా అలాంటిదే. మండపానికి  ఒక ప్రక్క భావనారాయణ స్వామి గుడి. ఇంకొక ప్రక్కన పోలీసు స్టేషన్ . పోలీసు స్టేషన్ ముందు ఏనాటిదో పెద్ద మర్రి చెట్టు, దాని మీద రక రకాలపక్షులు

సాయంత్రం అవగానే  ఎదుటి మనిషి మాట వినపడనంతగా రణగొణ ధ్వనిగా

గూడు జేరిన గువ్వల అరుపులు కేకలు. దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు సాగుతుంది .ఆతర్వాత సద్దుమణుగుతుంది .మళ్ళీ తెల్లవారు ఝాము

4 గంటలకు మొదలవుతుంది పక్షి కూతల మేలుకొలుపులు .తెల్లవారే దాకా అదే సందడి రోజంతాఅడపాదడపా  పక్షుల కేకలు విని పిస్తూనే ఉంటాయి .అలా వింటున్నపుడు భాష తెలిస్తే  ఎంతబాగుంటుంది వాటి ఊసులు వినవచ్చు అనిపించేది .

అలాగే మండపం చుట్టూ ఇంకా కన్యకా పరమేశ్వరి గుడి , రాముల వారి గుడి ఇలా చాలా ఉండేవి .మండపం మెయిన్ రోడ్డు మీద ఉండేది . మండపానికి దగ్గరలోనే మా ఇల్లు . మండపం నిర్వహణ  చిన్న బాబాయి  చేసేవాడు.పరిసరాలు శుభ్రంగా ఉండాలని గాంధీగారికి శుభ్రత ఇష్టమని  శుభ్రంగా వుంచక  పోతే అక్కడ నుండి పంపేస్తానని వాళ్ళకి గట్టిగా చెప్పేవాడు రోజుకొక సారి వెళ్ళి ఒక అరగంట అక్కడ కూర్చునేవాడు .వారానికి ఒక సారి హోమియోపతి ఆచారి  గారు  అక్కడికి వెళ్లి వాళ్ళ యోగ క్షేమాలు కనుక్కొనిమందులు ఇచ్చే వారు.ఎవరైనా  చనిపోయినా దహన సంస్కారాలు చేయించేవారు . ఆసరా లేని వాళ్లనిఅక్కున చేర్చుకునే  ఆశ్రమం  మా ఊరి గాంధీ మండపం.

అది ఒకప్పటి మాట .ఇపుడలా లేదు .మా ఊరు తెలుసుకోవాలనిపిస్తుందా.  గుంటూరు జిల్లా లోనిపొన్నూరు  మా ఊరు.

సరే మరి మళ్లీ  అసలు విషయానికి వద్దాం .

గొంతులో దుఃఖం సుడులు తిరుగుతుండగా  చెప్తూనే వుంది ..సంపూర్ణ

దారి అడిగి తెలుసుకుంటూ అప్ప చేయి పట్టుకు నడిచాను. చాలా దూరం నడిచినాక  ఆమండపం దగ్గరికిచేరాము .

అపుడే పొద్దు గూకింది .ఆమండపం నిండా జనం ఉన్నారు .కొంత మంది ముడుచుకుని దుప్పటి కప్పుకుని.కొంత మంది దగ్గుతూ మూల పడుకుని .కొంతమంది  చుట్టలు తాగుతూ  బాతాఖానీ  కొడుతూ ఉన్నారు.వాళ్ళని చూస్తానే ప్రాణం లేచి వచ్చింది .ఏదో ఒక సాయం చేయక పోరు .ముగ్గురం ఒక మూల గట్టు మీదకూర్చున్నాం . మండపం పక్కనే వీధి దీపం ఉంది  ఆవెలుగు మండపమంతా పరుచుకుంది.అందరూ తలతిప్పి మా వైపు చూసారు . క్రొత్త పక్షులు ..ఇది మామూలే అన్నట్లు మళ్ళీ వాళ్ళ పనిలో పడి పోయారు .

పక్కనే  మంచినీళ్ల  పంపు వుంది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి  కూర్చున్నాము . కొంత సేద తీరినట్లైంది.కాసేపటికి గుడిలో  ఆచారిగారు

ఒక బేసిన్ లో ప్రసాదం తెచ్చారు అందరూ గబగబా లేచి గిన్నెలు పట్టుకు నిలబడ్డారు .నేను , అప్ప దోసిలిపట్టుకు నిలుచున్నాం దూరం నుండే ప్రసాదం   విసిరేసి వెళ్లాడు . పిల్లోడు చంకలో వున్నాడు. మేము వచ్చినదగ్గరనుండి మమ్మల్ని గమనిస్తున్న  ఒక అవ్వ  మా దగ్గరికి వచ్చింది.

ఏంటి గిన్నె కూడాలేదా? అవ్వ

లేదని తల అడ్డంగా ఊపాను .

ఒక గిన్నె తెచ్చి ఇచ్చి  వాడుకో  ..మళ్ళీ ఇవ్వు  అని ప్రసాదం తినే పనిలో పడింది.

ప్రసాదం తిని నీళ్ళు తాగి గట్టుమీద కూర్చున్నాం.

అలిసి పోయాడే మొ  కొద్దిగా కడుపులో పడేసరికి అప్ప గట్టు మీద ఒదిగి పడుకున్నాడు .పిల్లోడు కూడానా వళ్ళో నిదుర పోయాడు .నాకు నిదుర రావటం లేదు . అవ్వ  వచ్చి నా దగ్గర కూర్చొని   వివరాలుఅడిగింది .చెప్పాను .

ఎక్కడైనా పని  ఇప్పించమని అడిగా.

ఏదోఒకటి దొరుకుతుందిలే ! దిగులు పడకు అంటూ అవ్వ వెళ్ళి పడుకుంది .

మనసు తేలిక అనిపించింది.రేపు ఆశగా కనిపించింది.

నాలుగు రోజులైనా ఎక్కడా పని దొరక లేదు.

అన్నం కూడా  మీరు పెట్టిందే సర్దు కున్నాం.రాత్రి పూట ప్రసాదం.

ఎక్కడికైనా  రోడ్డు మీదకు వెళ్ళి అడుగుదామంటే

వంటి మీద బట్టలు మాసిపోయి చినుగులు  పట్టాయి సర్దు కోవటం  కష్టమవుతుంది. గుండెలకు అడ్డంగాపిల్లోడిని అడ్డం పెట్టుకుంటున్నా ! మాట అంటూ పెద్దగా ఏడ్చేసింది.రెండు చేతులూ ఎత్తి దండంపెడుతూ

ఏదైనా పాత చీర ఇవ్వండమ్మా నిలబడాలంటే సిగ్గుగా వుంది .

అమ్మ కదిలి పోయింది.

ఏడవకు.. ఏడవకు ..ఇస్తాను అంటూ తను తీసి పెట్టిన బట్టలు ఇచ్చింది .

సంపూర్ణ  ముఖంలో చెప్ప రాని ఆనందం దుఃఖం తో  అమ్మ రెండు కాళ్ళ మీద పడి దణ్ణాలు పెట్టింది .

ఏదైనా పని చెప్పండమ్మా చేస్తాను .సంపూర్ణ కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ  అడిగింది.

అమ్మకు మనిషి అవసరం లేదు అయినా  సంపూర్ణ కోసం పని కేటాయించింది. ఆమె సంపూర్ణ వరుసగామూడు రోజులు ఇక్కడికి వచ్చినపుడే

నిర్ణయించుకుందనేది అమ్మను చూస్తే అర్థమయ్యింది.

ముందు శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకొని జుట్టు శుభ్రంగా దువ్వుకుని రా.

రోజుూ పెరడంతా ఊడ్చి చెట్లకు నీళ్ళు పోసి శుభ్రం చేయాలి .నీకు మీ అప్పకు అన్నం పెడతాను.సరేనా! అమ్మ

అలాగే అమ్మా ! సంపూర్ణ బదులు గొంతు నిండా ఆనందం.

వస్తున్నా వుండు  లోపల కెళ్లి సబ్బు , దువ్వెన తెచ్చి ఇచ్చింది . అలాగే  వాడి చేతిలో కొబ్బరుండ పెట్టింది.వాడిముఖంలో  భావం లేదు  తీసుకుని  అమ్మ ముఖం వంక చూస్తూ నోట్లో పెట్టుకున్నాడు.

అప్పకు అన్నం పెట్టి గంటలో  వస్తానని సంపూర్ణ వెళ్లింది .

అమ్మ ముఖం లో నిన్నటి అలజడి లేదు . చాలా తెరిపిగా  కన్పించింది .

నాకైతే  సినిమా లోనే అలా కష్టాలు వుంటాయి అనుకున్నా.సంపూర్ణ అలా చెప్తుంటే నాకు కూడాఏడుపొచ్చింది .తర్వాత అమ్మ చెప్పింది మన కష్టాలు చూసే సినిమాలు తీస్తారని.

నాన్న భోజనానికి వచ్చారు .అమ్మ లోపల కొచ్చింది. నాన్నకు తెలుసు  అమ్మ ఏదైనా అనుకుంటే అదిచేస్తుందని .

భోజనం చేసి కాసేపు పడుకుని లేచి మళ్ళీ షాపుకు వెళ్తారు .నాన్న నిద్ర పోయే సమయం లో మేము పెరట్లోచింత చెట్టు నీడలో ఆడుకుంటాము. పెరడంతా చెట్లతో చాలా చల్లగా అనిపిస్తది.ఎంత వేసవి అయినా  వేడితెలియదు .మాకు ఇంట్లో కన్నా పెరడు చాలా ఇష్టం.

కాకపోతే ఒకటే సాయంత్రం అవగానే చింత చెట్టు మీది పిట్టలు వేసే రెట్టలకు భయపడి .సాయంకాలం డాబామీద చేరి పిట్టల్ని లెక్క పెట్టే వాళ్ళం.

అమ్మ వంటింటిలో ఏవో సర్దుకుని అంట్ల గిన్నెలు బయట వేసి .వంటింటి గడపలో పుస్తకం పట్టుకుని ఒకకంట మమ్మల్ని కనిపెడుతూ కోడి కునుకు తీస్తుంది .

అన్నట్టుగానే సంపూర్ణ  అమ్మ ఇచ్చిన బట్టలు కట్టుకుని,తల దువ్వుకుని .కొడుకు కూడా చెల్లి గౌను వేసితెచ్చింది .

అమ్మా ! సంపూర్ణ పిలిచింది .

ఎవరూ అంటూ ఒక నిమిషం గుర్తు పట్ట లేక పోయింది తేరుకుని

..వచ్చావా! సరే ..అక్కడ చీపురుంది మొక్కల పాదుల లోనుండి ఊడ్చి బావిలో తోడి నీళ్ళు పోయి.అమ్మమాట చెప్పటం ఆలస్యం పిల్లోడిని చెట్టు క్రింద కూచోబెట్టి పనిలో దిగి పోయింది .వాడికి శుభ్రంగా స్నానంచేయించిందేమొ బక్కగా వున్నా బాగానే వున్నాడు .ఉంగరాల జుట్టు మొహం మీద పడుతుంది .

సంపూర్ణ కూడా చక్కటి కను ముక్కుతీరు .ముక్కు బేసర తో మనిషి చామన ఛాయ రంగుతో  చక్కగా వుంది .

అరగటంలో  అమ్మ చెప్పిన పని పూర్తి చేసి

ఇంకా ఏమైనా చెప్పండమ్మా చేస్తాను

అంట్ల గిన్నెలు కడగ మంటారా! సంపూర్ణ

వద్దు వద్దు  కోటమ్మ వస్తది . అమ్మ

పొద్దుటి అన్నం కొద్దిగా పచ్చడి ఒక గిన్నెలో వేసి  ఇస్తూ

గిన్నె వుంచేసుకో  చెప్పింది .ఇంతకీ నీ కొడుకు పేరేమిటి ..అమ్మ

వేలు స్వామి  అమ్మా ! దాని మొహంలో వెలుగు .అవ్వ గిన్నె ఇచ్చేస్తా.అంటూ  రేపు పొద్దున్నే వస్తానమ్మా! అంటూ పిల్లోడిని తీసుకుని వెళ్లింది .

సాయంకాలం అక్కలు అన్నయ్యలు వచ్చే టైమ్  అయిందని  .రాగానే తినటానికి  ఏదో ఒకటి చేయటానికివంటగదిలోకి వెళ్ళి పోయింది అమ్మ .

రాత్రి అన్నం తినేప్పుడు సంపూర్ణ గురించి మా అందరికి  చెప్పింది .మనం ఇవ్వ గలిగిన స్థితిలో వున్నపుడుచేతనైన సాయం చెయ్యాలి . సాయం వాళ్ళ  కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేలా చేయాలి . వాళ్ళనిబద్దకస్తుల్ని చేయకూడదు .ఒంట్లో కష్టపడే శక్తి వుండి అడుక్కోవటమంటే మనిషిగా మరణించినట్లే. అమ్మమాటలు ఇప్పటికీ  రింగు మంటూనే వుంటాయి .

సంపూర్ణ ముఖంలో,మాటల్లో అడుక్కోవటానికి ఎంత అభిమాన పడుతుందో మొదటి రోజే గమనించాను.తలెత్తి ముఖం లోకి చూడ లేక పోతుంది . తప్పక చేసింది .దానికి కష్టపడే తత్వముంది. ఇక దాని కష్టాలుతీరినట్లే.తన  కొడుకును , తండ్రిని పోషించుకుంటుంది .

అన్నం పెట్టి పంపేయొచ్చు కానీ కొద్ది రోజులకు దానికే అలవాటు పడి పోతది .అందుకే పని చేస్తే అన్నంపెడతానని చెప్పాను.వాళ్ళకి ముందు అన్నం అవసరం . ఆకలి మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది.

సంపూర్ణ స్థితికి వెళ్ళ కూడదనే  పని చేసాను. అలా అని కష్టాల్లో వున్న ప్రతి ఒక్కరిని ఆదరించలేము . మన పరిధి లో మనకు చేతనైన సాయం చేయటం తోటి మనిషిగా మనిషి బాధ్యత. సంపూర్ణ  ఒక మంచిపని దొరికే దాకా  మన పని చేస్తది . కష్టపడటం అలవాటయ్యాక  ఇక ఎవరి ముందు చేయి చాపదు.అలాంటి వాళ్ళకి మనం చేయూత నివ్వాలని చెప్పింది .

అమ్మ ఎపుడూ చాలా మంది సమస్యల్ని నెత్తిన వేసుకు పరిష్కరిస్తూ వుండేది .కొందరికి డబ్బు ,కొందరికిమాట ,కొందరికి మనుగడ ఇలా నడిచేది .

ఒక్కో సారి నాన్న విసుక్కునే వారు. వున్న బాధ్యతలు చాలక ఇవన్నీ అవసరమా !

అయినా  అమ్మ తన పని  తనదే అన్నట్లుగా వుండేది .

సంపూర్ణ పొద్దున్నే వచ్చేది.వీధి అరుగులు కడిగి ముగ్గులేసేది. పెరడంతా అద్దంలా పెట్టేది.పూలు కోసిమాలలు కట్టేది . అమ్మకి అన్ని పనుల్లో సాయం చేసేది. మేమందరం బయటకు వెళ్ళేవరకు  లోపలకు వచ్చేదికాదు.

వేలు స్వామి కి తినటానికి మరమరాలో  గిన్నెలో పోసిస్తే చెట్టు క్రింద కూర్చొని తింటూ ఆడుకునే వాడు .

అమ్మ చెప్పినట్లే  మాఇంట్లో పని చేయటం చూసి పక్కనవాళ్ళు ఎదిరింటి వాళ్ళు కూడా వీధి అరుగులుకడిగించుకునే వాళ్ళు . అలాగే మండపానికి ఎదురుగా వున్న పిచ్చయ్య దోశల కొట్లో అంట్లు కడిగేది. అలామెల్లిగా మండపం లోనుండి  చిన్న గుడిసెలోకి అద్దెకు  వెళ్ళింది .

అప్పను బాగా చూసుకొనేది .సంపూర్ణ లేని సమయం లో గుడిసెకు కాపలా కాసే వాడు .

గాంధీ మండపం నుండి వెళ్ళినా

ప్రతి రోజూ ఉదయమే వచ్చి అక్కడి వాళ్ళందరినీ వరసలతో పలకరించి  గాంధీ మండపం శుభ్రం చేసి ముగ్గువేసి .పనుల్లోకి వచ్చేది .

ఎన్ని పనులు ఒప్పుకున్నా అమ్మ దగ్గరకొచ్చి  అమ్మ పనులు చేసి పెట్టేది.

అమ్మ మాటంటే దానికి అమితమైన విశ్వాసం . అమ్మకు చెప్పకుండా ఒక్క పని కూడా చేసేది కాదు . రోజులుగడుస్తున్నాయి.వేలుస్వామిని బడి లో వేసింది.వంట మామ్మతో  పెళ్ళిళ్ళకు వంటసాయం వెళుతూ డబ్బులుఅమ్మ దగ్గరే దాచుకొనేది .

ఇంట్లో అందరం కూడా వేలు స్వామిని ,సంపూర్ణను ఇంట్లో మనిషి లాగే చూసుకునేవాళ్ళం .

అమ్మ కూడా సంపూర్ణను  చాలా ప్రేమగా చూసుకొనేది. పండగలకు మాతో పాటు వాళ్ళకు కూడా క్రొత్త బట్టలుకుట్టించేది .

సంపూర్ణ చక్కగా స్థిర పడింది .సంపూర్ణను చూసినపుడంతా అమ్మ ముఖంలో చాలా సంతృప్తి కనిపించేది.

అమ్మకు పనికి మనిషి అవసరం లేదు కానీ అప్పుడు సంపూర్ణకు సాయం అవసరం.

   అదే అమ్మ వ్యక్తిత్వం  అందుకే అమ్మంటే అందరికీ అంత ఇష్టం.ఇది నా చిన్నపుడు నిజంగా జరిగిన సంఘటన.

                           రచన.  విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language