ఆర్పేయకు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

వెతలతోనె ఎదనింపకు …ఆశలనే ఆర్పేయకు
చిరునవ్వులు చిదిమేయకు …చింతలలో తోసేయకు

తోటమాలిగ బాసచేసి తొడిమనేల తుంచుతావు
మది నవ్విన గురుతులనే మనుగడగా మలిచేయకు

శ్వాస లోన ఊసులోన లయ తప్పని నీ ధ్యాసే
తిరిగి రాని సమయాన్నిల చితి లోనా కాల్చేయకు

సందె వేళ గువ్వైనా గూడుజేరు విజయంగా
కొండ కోన దాటి పోకు గుండె తలుపు మూసేయకు

అందలాలు అందలేవు ఆశమీరి …అలసి పోకు
ఆరిపోని ఆర్తి నింపి తల వాకిట నిలిపేయకు!!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language