శుభోదయం 🌹🌹🌹🌹🌹
“వెంట వున్నది అంటి రాదు “. విజయ గోలి
ఆకాశమంతా అలుముకున్నాయి
ఎక్కడివో ఎర్ర మబ్బులు …
ఏ ఆవేశపు అగ్ని జ్వాలల ఆవిరో ఇది
ఏ రుధిరపు కడలి అలలు తాకాయో
ఊపిరాడనీక.. ఉసురు తీస్తున్నాయి
తేలి పోయే నల్ల మబ్బులు కావివి
గుమ్మరించే నెత్తుటి కుంభాలు
యుద్ధ తంత్రాల చీకటి నైచ్యం
శకలాలుగ రాలిపడిన తలలు
చరిత్రలో చెక్క బడే వికార శిల్పాలు
భావికి పరిచిన విష శరాల తల్పాలు
ఏ యుద్ధం శాంతి నిచ్చింది?
ఉనికి కోసం ఉన్మాదం పంచుకుంది
ఛ్చిద్రమైన జీవితాల్ని స్థూపాలుగ మార్చింది
అహం మంటల మధ్య
అణుబాంబుల అభ్యుదయాన్ని నిలిపింది
శిథిలాలను తిరగేస్తే చరిత్ర చెపుతుంది
చక్రవర్తులు చేయి ఊపుతూ వెళ్లారు .
వెంట వున్నది నిన్నంటి రాదని ,
అవని మీద అధికారం ఎవ్వరికీ లేదంటూ …
అందుకుంటే సందేశం …సమరానికి …సందు లేదు
యుద్ధం ముగిసాక …బుద్ధుడినంటే ఎలా ?