నారీ ..విజయ గోలి
నారీ..అన్న నీ పేరులోనే ..
భేరీ శబ్ధముంది..
నారిని సవరించు …
నిశ్శబ్ధాన్ని భేదించు ..
అబలనంటూ ..అలుసైపోకు ..
సబలవై సమరం సాగించు ..
సహనానికి సమాధి కట్టేయి
బానిసత్వపు బంధనాలు …
త్రెంచి ఇక ముందుకు కదులు
మదాంధులను మట్టికరిపించే
మహాశక్తివై విజృంభించు ..
కరుడు కట్టిన మృగాలను ..
కాలిక్రింద తొక్కిపెట్టు ..
ఆత్మ వంచన ..అసలు వద్దు ..
సృష్టి అంటే నీవైనపుడు ..
శక్తి లేదనుమాట వద్దు ..
అండపిండ బ్రహ్మాండాలను ..
కంటిచూపుతో ..కదిలించే ..
ఆదిశక్తికి..అసలైన వారసురాలివి …
సాధించే సమయమే వచ్చింది …
సామరస్య మికలేదు ..సర్వత్రా …
సమానత్వమే ..లక్ష్యం గా ..కదులు ముందుకు ..విజయ గోలి