ఓ మహిళా..

మహిళా….విజయ గోలి

వెలుగుతున్న సూర్యుడివే నీవు కదా!

దివిటీలతొ పోటీలా..

నల్లమబ్బు అడ్డొస్తే

వెలుగుదాగి పోతుందా

అబలలనే అలతిపదం

అతికించిరి మేధావులు

సబలలుగా తెగువేదో

చరితలెన్నొ  చెప్పాయి

కనుచూపుల బ్రహ్మాండం

కదిలించే శక్తి నీది

కఠినతపై కరుణ తెరలు

కావాలని దించుతావు

అణువణువున అమ్మతనం

అమృతమే నీవుకదా

సంపూర్ణతే నీవైతే

సాధికారతా  సమరమంటె

సహనమలిగి  పోతుంది

ప్రతి జీవికి ఉనికి నీవు

నీ ఉనికే ప్రశ్నైతే

పోరాటం  తప్పనిదే

కాలుడినే ఎదిరించిన

గట్టి ఘనత నీది కదా

కదనమైన కవనమైన

నీ కరముల విన్యాసమే

ఆత్మబలం పెంచుకుంటే

ఆడదన్న అలసత్వం

అలిసి పోక తప్పదులే.!

అధిగమించిన అధికారం

అంతమయ్యే రోజున్నది

నిక్కములే నీ గెలుపు

వినువీధుల  ప్రజ్వలించు

ప్రమదావన ప్రమిదలు

వేదాలే కీర్తించే  విజయ మెపుడు  నీదేలే!!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language