శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఎదగాయం లోతెంతో ఎవరెవరికి తెలుసునోయి
చిరునవ్వుల సింగారపు బరువెవరికి తెలుసునోయి
నీటకరిగే మాటకాదు హృదిపైనా పచ్చబొట్టు
పదిలంగా చెక్కుకున్న రూపెవరికి తెలుసునోయి
వలవిసిరిన జాలరితో వలపుఆట గెలవలేదు
ఓడివున్న ఒంటరిలో వెలితెవరికి తెలుసునోయి
కాలంలో కనుమరుగౌ కనిపించే వ్యధలెన్నో
మరుగవ్వని మధురమైన కలతెవరికి తెలుసునోయి
కన్నీటితొ నిశిని కడిగి ఉషోదయపు వేదికపై
వెలుగు రంగు లద్దుకునే వెతలెవరికి తెలుసునోయి