కదిలే కాలం
విజయ గోలి
కదిలిపోవు వయసునే
ఆగమంటు అడిగాను
ఆగలేను రమ్మంటూ
నవ్వేస్తూ నడిచింది
నీబాటలొ నడిచినేను
ఓడినాను ఎన్నిటినో
బాల్యాన్నే బ్రతుకులో
వదిలినాను మొదటిగా
కౌమారపు కలలెన్నో
కంటూనే జారినాను
నడిమివయసు నటనలోకి
నాదికాని బ్రతుకులోకి
ఏమున్నది ఈలోకం
స్వార్ధానికి అర్ధాలుగ
వృద్ధాప్యపు వ్యర్ధాలుగ
దేనికొరకు పరుగులు
చెప్పమంటు అడిగాను
వయసునే ఆర్తిగాను
వయసు నవ్వి చెప్పింది
కదులుతున్న కాలంలో
సాగిపోవు బాటసారి నేను
గమ్యముంది …నాకు
గుండెతీపి గురుతుగ కొందరికి
కంటి నీటి చెమ్మగా కొందరికి
కరిగి మిగిలిపోతానన్నది
అడుగు ముందుకేస్తూనే వడివడిగ