చూడగనే కనులజేరి

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

చూడగనే కనులజేరి కలలునింపి పోయావు
తెలియకనే మదిని దోచి వలపునింపి పోయావు

మరువనులే దరహాసం మత్తులోన ముంచావు
చురకత్తుల చురుకుతోటి చూపుదింపి పోయావు

తేనె విందు తేటి యాట తెగువలనే చూసాను
మనసుపడిన వేళలలో మరులునింపి పోయావు

కలువనై వేచి వేచి మందారమై విరిసేను
తొలికిరణపు తోరణాల వెలుగునింపి పోయావు

పొద్దుతిరుగు పూవునేనై దిక్కులన్ని వెదికాను
సందెవేళ సింధూరం నుదురునింపి పోయావు

నడిరేయిన తారకనై తనివితీర చేరగా
మబ్బులలో దాగి నీవు తళుకునింపి పోయావు

అందరాని చందమామ ఆటలలో హాయుంది
పరవశాల పరిమళించు తలపునింపి పోయావు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language