🌹
విజయ నీరాజనం 🌹 విజయ గోలి
అవనిమీద అతివగా
అనునిత్యం అడుగడుగున
అంతరంగ సంగ్రామమే
అనురాగపు ఆవరణలో
అందమైన లక్ష్మణ రేఖలు
బాధ్యతల బరువులెపుడు
నువు మెచ్చిన బంధాలే
బలహీనత నీ బ్రతుకున
పరుచుకున్న ముళ్ళబాట
పదిలమెపుడు లేదులే
కనకదుర్గవైనా కాళికమ్మవైనా
కఠినమైన రూపు వెనుక
కన్నతల్లి కరుణే కదా
ఓరిమిలో ధరణివి కదా
తరుణి పేరున తరువు కదా
అంతరిక్షమంత ఎత్తు ఎదిగినా
అంబరాన సంబరమై నిలిచినా
ఆగవెపుడు నీపైన అణచివేతలు
పుడుతూనే కట్టు బానిసగా
కట్టివేసిన మృగ అహంకారం
కనుమరుగు చేస్తుంది కావ్యాలనే
అతివంటే యాగమంటూ
అతివంటే యోగమంటూ
అలలపై నిచ్చెనేసి
అందలం ఎక్కించేరు
అంతు తెలియని అగాధాల
ఆయువుతో ముంచేరు
మేలుకో మహిళా మేలుకో
ఎవరో వస్తారని ఎదురు చూడకు
తెలుసుకో నీశక్తి తెలివిగ నడుచుకో
నీ ఆత్మబలమే.. నీ బలం
అందుతుంది ఆనాడే
విశ్వమందున విజయ నీరాజనం🙏🏻