ప్రముఖ రచయిత్రి తెలుగు సాహితీ వనం అడ్మిన్ శ్రీమతి శాంతి కృష్ణ గారి “చినుకు తాకిన నేల” కవితా సంపుటి. పై నా సమీక్ష.
🍁సాహితీవనంలో జాలువారిన చినుకులు🍁
చాలా రోజులుగా చాలా మంది రాసిన పుస్తకసమీక్షలు చదువుతుంటే నాకు కూడా సమీక్ష రాయాలనిపించింది. కానీ రాయలేనేమో అనుకుంటున్న నాకు ధైర్యం చెపుతూ ముందడుగు వేయించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి శాంతికృష్ణకి హృదయ పూర్వక ధన్యవాదాలు.
ఆమె ఇచ్చిన ధైర్యంతో మొదటగా వారి పుస్తకం *చినుకు తాకిన నేల*. కవితా సంపుటిని నా సమీక్షకు ఎన్నుకున్నాను.
“శాంతి కృష్ణ” ప్రతి కవిత ఒక రసా స్వాదన, భావ సౌందర్య లహరి.
ప్రతి కవిత లోను సమాజం పట్ల బాధ్యత, ప్రకృతి పై ప్రేమ కనిపిస్తాయి.
అలాగే భాషను ఒక అందమైన సున్నితమైన పూవును పూజలో చేర్చినట్లుగా పరిమళించే పదాలతో ఎవరినీ నొప్పించని శైలిలో…(ఆవిడ మనసు) లాగే…సుతిమెత్తని పదాల పారిజాతాలను ఏరి కూర్చుతారు.
“చినుకు తాకిన నేల” …పుస్తకం పేరులోనే. తొలకరి మట్టి పరిమళం గుప్పు మంటుంది…
“నింగినుండి జారిన చినుకు
నేలను ముద్దాడిన వేళ
పరవశించదా నేల
పరిమళాల వాగై..
ఎదను తాకిన భావాలు
కరిగి చినుకైన వేళ
అక్షరమే మురియదా
కవిత్వమే తానై…” అంటారు….
ఎంత మృదువైన భావన… నిజమే ఆమె ప్రతి కవితలో అక్షరాల సెలయేరే…
నీలాకాశంలో నిండు చందమామ ఆ కవనంలో తొంగి చూస్తుంది. ఆకు నుండి రాలే మంచు బిందువుల ఉనికి ఆమె హృదయాన్ని స్పర్శిస్తుంది…
ఇంక పుస్తకం లోపలికెళదాము…
మొదటగా… “గురువంటే నాన్నే”…కవితలో….
‘నాన్న’ ఆ పదమే హృదయపు సడియై, నాన్న హిమవన్నగం అంటూ ఆదిగురువుగా అక్షరాంజలి సమర్పించారు…
“మొగలి రేకులు”అన్న కవితలో…హిజ్రాల జీవితాన్ని హృదయం ద్రవించే విధంగా రూపొందించారు…
“రేయంతా సలుపుతున్న గాయాల నుండి రేపటి చప్పట్లకై శక్తిని పుంజుకునే అర్ధనారీశ్వరులం”…అంటారు…
గుండెకు గొంతుకు మధ్య పట్టేసిన బాధ, సమాజంలో వాళ్ళ స్థానం పై ఆవేదన ప్రతి అక్షరంలో కనిపిస్తుంది…
అనాధ పిల్లల ఆకలి సమరాన్ని ఎదర్కునేందుకు చీకటి మరకలను తుడిచే పువ్వొకటి తూరుపు కొండల్లో పుష్పిస్తుంది అంటూ సూర్యోదయాన్ని ఎంత భావగర్భితంగా చెప్పారో…”రేపటి పువ్వు” కవితలో…
“మృగాడు” కవితలో..నేటి సమాజంలో ఆడపిల్ల జీవితం గమ్యం తెలియని నడకలు అంటారు…మగవాడి రాక్షసత్వానికి ఉరిశిక్ష వేసినా
ఉరికొయ్య కూడా మరణిస్తుందేమో
వాడిని మోసిన పాపానికి అంటారు. ఆ గుండెలో ఆర్తి యొక్క నిరసన భావం…
“చినుకు తాకిన నేల” కవితలో…
“కాసింత నీ సాయానికే
చిగురించిన కొమ్మల్లా..
పచ్చదనాన్ని రాసుకుని
పసిడి మొక్కలవుతారు…ఎదిగి వచ్చి వృక్షాలయి
మరెందరో అభాగ్యులకు
ఆసరాగా నిలుస్తారు”…అనడంలో
ఎంత ఉదాత్త భావన . మానవత్వం మల్లెలా విచ్చుకుంటే…
పరిమళం వనమంతా అలము కుంటుంది.కాసింత సాయం మనతోనే మొదలవ్వాలి. చక్కటి సందేశం కదా…
“స్నేహ పరిమళం” లో….స్నేహం విలువ స్నేహశీలి శాంతికృష్ణ మాటలలో…
కష్టం కలిగించిన క్షణాలలో
హత్తుకునే అమ్మవ్వాలి,
తప్పటడుగులు వేస్తుంటే
నడిపించే నాన్నవ్వాలి అంటారు. అంటే స్నేహం బాధ్యతని ఎంత గొప్పగా వివరించారో చూడండి…
“మరలి రాని స్వప్నం”గా …బాల్యాన్ని వర్ణించిన తీరుకు మనకు వెంటనే బాల్యం కోసం అమ్మ దగ్గర మారాం చేయాలనిపిస్తుంది…
“వెన్నెలకూన” కవితలో చిరు మొగ్గల లాంటి చిన్నతల్లులపై మృగవాంఛ తో చిదిమి వేస్తున్న రాక్షసుల చేతులను ఖండఖండాలుగా నరకాలి…కాఠిన్యపు మంటలలో కాల్చి వేయాలంటారు…ఆ భావోద్రేకం మన గుండెలను కూడా తాకుతుంది.
తెలంగాణా సంస్కృతికి అద్దంపట్టే మహంకాళీ బోనాల పండుగ , బంగారు బతుకమ్మ పండుగ ఇంకా ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి ఏరువాక పౌర్ణమిని, సంక్రాంతి సంబరాలని తనదైన అందమైన శైలిలో అల్లిన మల్లెల పరిమళం…
ప్రకృతిని ఆలింగనం చేసుకుని పరవశించే ప్రణయతత్వం…శాంతికృష్ణది.
చక్కని శ్వేత వర్ణంలో ముద్దుగా విచ్చుకున్న నందివర్ధనానికి ఎన్ని పేర్లు అంటూ సుకుమారంగా వివరించిన తీరు ముదావహం.
ఒంటరితనం ఆత్మీయ స్పర్శ లోనే ఊరడింపు పొందుతుంది.
ఆ స్పర్శ ఒంటరి తనానికి లేపన మంటారు కవయిత్రి…నిజమేకదా…
“మా తెలుగు తల్లి”. కవితలో ఎంత చక్కని భావ సోయగం..
అక్షరాల మాలలల్లి
నీ మెడలో వేయు వేళ
జారెనేమో ఒక్క సుమం
ముద్దాడగ నీ పాదం
ఆ అక్షరం నేనని
పరవశిస్తుంటాను…” మది తడిమే మధుర భావం కదా….అలాగే “తెలుగు సవ్వడి” కవితలో
తెలుగు భాషపైన ప్రేమని, భాష ఔన్నత్యాన్ని ,మధుర పదాలలో మధువు లొలికించారు…
“వెచ్చని తడి” లో….భరతమాత ముద్దు బిడ్డలైన సైనికులపై మారణహోమం జరిగినపుడల్లా జాతీయ పతాకం వారి రుధిరంతో ఎరుపెక్కుతుంది అంటూ… తడిగా హృదయాన్ని స్పృశిస్తారు…
మొత్తం 70 కవితలతో ఉన్న ఈ “చినుకు తాకిన నేల” తడి పాఠకుల మనసులపై చిగురులు వేయిస్తుంది. ఈ సంపుటిలోని ప్రతి కవిత ఒక సందేశాన్ని అందచేస్తుంది.
ఇటీవలే ఈ పుస్తకానికి “గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు” కూడా లభించింది.
ఇంత మంచి కవిత్వ సంపుటిని “చినుకు తాకిన నేల” గా పాఠక లోకానికి అందించిన శాంతికృష్ణ గారు ఎప్పటికీ అభినందనీయులే. ప్రతి ఒక్కరు చదువ వలసిన కవితా సంపుటి ఇది.
సమీక్షకురాలు
శ్రీమతి విజయగోలి,
హైదరాబాద్.