గజల్ విజయ గోలి
తలపే వుంటే తరలే రాడా తారల దారుల
వలపే వుంటే రేడై పోడా పొన్నల దారుల
జాడే లేదుగ జాబిలి వెలుగుల జాలే లేదే
వేచిన వేళల వేదన పెంచునె మమతల దారుల
వెన్నెల బాటల గంధపు జల్లుల వివశము కానడు
మరిచినె రాధను మాధవుడెందుకొ అలకల దారుల
మోహన గానము మగతల కమ్మగ మాయలు చేసే
అలసిన కన్నుల కునుకై పోయే స్వప్నపు దారుల
జగడము లెందుకు జాగులేల రా ఓడితి నేనే
విజయము చేయగ వేచెద నీకై వరాల దారుల