శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నీ దారిన కనులేమో దీపాలుగ నిలిపేను
నీపేరే పెదవులపై మంత్రంగా పలికేను
తలుపులనే తెరచివుంచి తలపులతో వేచేను
కొడిగట్టక సందెదీపం తెలవారగ వెలిగేను
నీమాటల మధువులతో ఊరడింపు కోరేను
నీ కుశలపు ఊసులనే కబురంపగ అడిగేను
కన్నీటినే శాసించా రెప్పదాటి రాకంటు
చిరునవ్వును చెదరనీక నిబ్బరంగ నిలిచేను
తొలిచివేయు చీకటిలో ఒంటరిగా నడిచాను
ఎడబాటుకు తొట్రుపడక మౌనంగా జరిగేను
చిరుచినుకులు తడపకుంటె హరితమెలా ఎదుగుతుంది
సుడిగుండపు వడికెపుడూ దూరంగా కదిలేను
ఎదకదిలే చప్పుడుగా మలిగిపోని విజయ ముగా
జంటగాను జ్ఞాపకాలు వెంటరాగ గెలిచేను