గజల్ విజయ గోలి
తొలిసారిగ ప్రేమలేఖ వ్రాయాలని అనుకున్నా
నీప్రేమకు చిరునామా కావాలని అనుకున్నా
అడగాలని అనిపించదు నీఅనుమతి కానుకగ
అలజడిలో అనుభవమే అందాలని అనుకున్నా
అవునన్నా కాదనినా నీతలపులొ నిలిచేను
చిరు నవ్వుల సంతకాలు చేయాలని అనుకున్నా
మదివీణను శృతిచేసా మమతకోరి వ్రాసాను
రాయంచనె రాయబారం కోరాలని అనుకున్నా
గాలివాలు గమనాలకు గమ్యమునే చెపుతున్నా
ఇగిరిపోని గంధాలను ఇవ్వాలని అనుకున్నా
ఛమేలీల చిలిపితనపు వలపునింపి వ్రాసాను
పసిడిపూల తేరులపై పంపాలని అనుకున్నా
కలలనిన్ను నిలుపుకొని అల్లుకున్న ప్రేమకధ
విజయాలతొ కావ్యంగా మిగలాలని అనుకున్నా