జయమాల

మిత్రులకు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹

*జయమాల. విజయ గోలి

శివధనువు ఎక్కుపెట్ట
శ్రీమహావిష్ణువే కదిలివచ్చెను
కళ్యాణ రామయ్యగా
సిగ్గు మొగ్గల జానకి
వేచివున్నది శ్రీమహాలక్ష్మిగ
పరిణయ రాగాలు పాడగా

ధనస్సువిరిచి రామయ్య
సీతవంకచూసేను
శిరస్సువంచి సీతమ్మ
సిగ్గు ముగ్గులేసింది

మేలిముసుగుమాటుగా
ఓరకంటచూసింది
కనులుకలిపిరామయ్య
నవ్వాడుచిలిపిగాను

పసిడి పూల వరమాల
పద మంటూ పలికింది
తడబడుతూ జానకి
అడుగు ముందు కేసింది

అరచేతి గోరింట చెక్కిలిపై మెరిసింది
వేసింది జయమాల మెడలోన
చిరునవ్వు నవ్వాడు అందాల రామయ్య
వేయివీణలు మ్రోగే సీతమ్మ మదిలోన..
పాణిగ్రహణమె పరమ పావనమాయె..

సీతమ్మ పాపిట సింధూరమే
రామయ్య కన్నుల సిరులయినది
ముక్కోటి దేవతలు మురిసి కురిపించేరు
ముదమార ముత్యాల తలంబ్రాలు
ఆకాశమే తారల తళుకులే వొంపేను
అవని విరిసెను అందాల హరివిల్లులే

చూడ ముచ్చటలాయె .. శ్రీ సీతారామ కళ్యాణము కమనీయము
ఎన్ని జన్మల పుణ్యమో ..గాంచిన కనులదే రమణీయము

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language