విజయ గోలి గజల్
మధువనిలో మధుమాసం విరిసినదే రంగులలో
మాధవునీ మధుహాసం మెరిసినదే రంగులలో
పువ్వులన్నీ నవ్వులుగా పున్నమిలో కలువలుగా
వెల్లువెత్తి పుప్పొడులే జల్లినదే రంగులలో
గోపెమ్మల బుగ్గలపై ఎరుపెక్కెన గోధూళిగ
వ్రేపల్లియ వాడలన్నీ మురిసినదే రంగులలో
పొదపొదలోరాధమ్మ పొంచిపొంచి రంగుజల్లె
నగధారీ నటనలలో నవ్వినదే రంగులలో
వసంతాల హోరులలో వర్ణములే వన్నెలొలక
కాముని పున్నమి వేళలొ చిమ్మినదే రంగులలో
కొంటెవాని అల్లరిలో జంటకలిసె మన్మధుడే
వెంటబడీ వనితలనే తడిపినదే రంగులలో
ఆనందం అర్ణవమై అంబరాన్ని అందుతుంటె
ఆనందుని రాచకేళి తుళ్ళినదే రంగులలో