గజల్ విజయ గోలి
మధురమైన నాబాల్యం పిలుపు తిరిగి కావాలి
మరువలేని జ్ఞాపకాల మలుపుతిరిగి కావాలి
వయసుతోటి వలసొచ్చిన కలిమంతా కలలేగ
చిన్ననాటి నేస్తాలతొ నవ్వుతిరిగి కావాలి
వాననీటి వాగులలో కాగితాల పడవలతొ
కరిగినట్టి కాలంలో పరుగుతిరిగి కావాలి
చిరుఅలకల చింతలతో చిలిపిచిలిపి అల్లరితొ
చిందాడిన సంబరాల అలుపుతిరిగి కావాలి
పలకమీద పంతులుకు పిలకవేసి ఫక్కుమన
వీపుమీద చింతబరిక తీరుతిరిగి కావాలి
చేలగట్ల దారులపై పతంగులతొ పందేలు
ఏటిలోన ఈదాడిన తలపుతిరిగి కావాలి
పగలురేయి ఒక్కటిగా పరుగెత్తిన స్నేహాలు
కోవెలలో జేగంటల గురుతుతిరిగి కావాలి