గజల్ విజయ గోలి
తలవగనే తలపులలో తరలివస్తె తన్మయమే
పిలువగనే నల్లనయ్య నడిచివస్తె తన్మయమే
వెన్నెలమ్మ నవ్వులలో విచ్చుకున్న కలువలన్ని
వెలుగుపూల దివ్వెలుగా తేలివస్తె తన్మయమే
పున్నాగల సన్నాయితో సిరిమువ్వల సవ్వడులే
వెన్నదొంగ నవ్వులుగా చేరివస్తె తన్మయమే
మధుమురళీ రవములలో బృందావన సమీరాలు
రాసకేళి రసభరితం కదిలివస్తె తన్మయమే
రాధమ్మ పిలుపులలో రాగాలే రవళించగ
వనమాలీ వసంతుడై వలచివస్తె తన్మయమే