*అల తడిచిన మువ్వల సడి
విజయ గోలి
నటరాజు నర్తనలో ఘల్లుమంటు
శివకామి చిరునవ్వుల నినదించి
చిందాడిన చిరుమువ్వల సవ్వడి
కోమలాంగుల కులుకు నడకల
చిరుగజ్జెల రాజిల్లెడు స్వర ఝరి
సిరిమువ్వల స్వరలహరి
అతివల పద పల్లవముల
అందమైన అలరింపుల
రాగ తాళముల సంగమ కేళి
అడుగడుగున ఆనందహేళి
రాయంచల నడకలలో
రవ్వల మువ్వల సవ్వడి
ముదితల మురిపముల
ముచ్చటాడు సెలయేటిసడి
జాణతనముల జావళీల
రవళించే నవరాగ జతి
అల తడిచిన మువ్వల సడి
వసంతుని వలపుల జడి
శుకపికముల ఆలాపనలో
రాగసుధల రస సమ్మేళనమే
ఆమని అడుగుల నాట్యగతి
సత్యభామ నడకలలో
సరసపు మువ్వల రవళి
చిన్నబోవు ఆ మోహన మురళి
మాధవుని మదిలో మ్రోగు
మరుని శరముల స్వరజతి.
లత్తుకతో లయచేసి
నుదుటి సింధూరపు
చిన్నెలుగా సుదతుల
సొంతమైన సింగారపు
మంజీరపు సుస్వర లహరి