*మౌనం విజయ గోలి
మౌనం ఎపుడూ
మాటలకందని మర్మమె కాదు
రెండు మనసుల
నిండు ప్రేమల పాటే ఒకసారి
అనురాగం అలకల
నలిగిన కమనీయపు
కలయికలే ఒకసారి
వియోగాల విరహాల
విడలేని గాధే ఒకసారి
బ్రతుకు రోసిన బాధల
మాట దాగిన బాటే ఒకసారి
మంటలు దాచిన మది
గొంతు దాటని గోడే ఒకసారి
ఎగిసిపడే ఆవేశాన్ని
అధిగమించి అణిచివేయు
అనునయమే ఒకసారి
మెత్తని కత్తిగ గుండెను
గుచ్చే మరణమె ఒకసారి
మనసు లోతుల
మమతలు తడిమితే
మంచుగ కరిగి
మాటగ మారే మౌనమె ప్రతిసారి