గజల్ విజయ గోలి
వెన్నెలయ్య వెలుగులలో ఆటలాడ వేచితినీ
నల్లనయ్య నీనవ్వుల పాటపాడ వేచితినీ
గున్నమావి కోయిలమ్మ గుట్టుతెలిసి నవ్వుతుంది
గుండెలోని గుబులంతా మాటలాడ వేచితినీ
వింజామర వీవనలే తనువుతాకె గిలిగింతల
సెలయేరుల దారులలో జలకమాడ వేచితినీ
ఊహలలో ఊయలైతి ఆశలలో శ్వాశనైతి
అణువణువు నీధ్యాసల ఊసులాడ వేచితినీ
పూవునేను తావినీవు తనివితీర విజయములే
నీయెదపై వనమాలగ నటనమాడ వేచితినీ