పాణీ అమ్మమ్మ విజయ గోలి
తూరుపు సంధ్యా రాగంలో
పడమటి ఉదయపు వెలుగులలో
మంచుపూల మాసములో
విరిసినది చిరునవ్వుల
లేవన్నెల లేత గులాబీ
అమ్మా నాన్న కన్నులలో
తొలకరి మెరిసిన
తొలి చిగురు పాపగా
పగడాల కొమ్మపైన
పలువన్నెల పాలపిట్ట
చిరుమువ్వల సవ్వడిగ
నట్టింటను నడిచినది
శ్రీలక్ష్మియే సింధుపాణి
చిన్ననాడు కులుకులతో
చిలుకలకే పలుకునేర్పు
అమ్మమ్మకు తాతయ్యకు
ఆటలలో పాటలలో
అంబరాన చందమామ
రియా తోడు ఆటలలో
రివ్వునెగురు పిట్టతాను
బుంగమూతి అలకలలో
బుజ్జి తోటి పంతాలు
అమ్మమ్మను అల్లుకున్న
అపరంజి పూలతీగ’
కధవింటూ కలగంటూ
వడిలోన ఒదిగిపోయి
నిదురోయె చిన్నతల్లి
తమ్ముడితో తమాషాలు
చిలిపి చిలిపి తగాదాలు
ఎదుగుతున్న వయసులోన
శ్రీదేవి నుదుటి సింధూరమే
స్నేహాలలో వున్నతమే
వావి వరుస బంధాల
వన్నెతెచ్చు ముత్యాల సరమే
వాగ్దేవి వరమే ఆ వజ్రం
విద్యలలో వివేకం
విలువైనది వికాసం
సంపూర్ణ సఫలతే
సమర్ధతల సమతుల్యం
అమ్మమ్మకు ప్రత్యేకం
అనుబంధమే ఆత్మీయం
పాతికేళ్ళ ప్రాయమైన
పసిపాప వైనం
కోరుకున్న దారులలో
కొలమానం లేకనే
అడుగడుగున మెరవాలి
అందమైన జీవితం
ఆనందమయం కావాలి