గజల్ 11 రచన .-విజయ గోలి
నవ్వులలో నీ మోమున అద్దినదే రంగుకదా
కాటుకతో నీకన్నుల దిద్దినదే రంగుకదా
సప్తపదుల సంగమంలో నునుసిగ్గుల వెల్లువలో
మూడుముళ్ళ ముచ్చటలో కురిసినదే రంగుకదా
ఆశలవాకిళ్ళుతీసి అంబరాన తిరుగాడి
అందలేని సంబరాల అందినదే రంగుకదా
అద్దమంటి మనసుంటే ఆ అందం విజయమేగ
పసిపాపల నవ్వులలో మెరిసినదే రంగుకదా
నలుపుచూసి నలుపంటూ నవ్వులాడ చూసేరుగ
విశ్వమంత విస్తరించు విశ్వమూర్తి రంగుకదా