విజయ గోలి గజల్
ఆశ్వీజపు పున్నమిలో ఆడుతుంది రాసలీల
నల్లనయ్య మాయలోన నవ్వుతుంది రాసలీల
బృందావన సందడిలో భామకొక్క తీరుగానే
కన్నుగప్పి కన్నుకలిపి సాగుతుంది రాసలీల
మురళితోడ మువ్వలన్నీ ఘల్లుమన్న సవ్వడిలో
ఉల్లములే ఝల్లుమంటు మ్రోగుతుంది రాసలీల
రమణీయం ప్రణయాలె సమ్మోహన మోహనమే
పొదరిళ్ళన ఊయలగా ఊగుతుంది రాసలీల
కన్నయ్యలో కర్పూరమై కరగాలని కన్నియలుగ
వేడుకలో విజయాలై రాజుకుంది రాసలీల