విజయ గోలి గజల్
చిత్తమందు చిలిపివూహ ఉత్తరమే వ్రాయమంది
చిరుగాలుల అల్లరేదొ చిత్తరువే గీయమంది
చందమామ అలకబూని తారలనే దూరమంది
సందెకాడ విందుగాలి అందాలనే నిలవమంది
చిలిపిగాలి చేతలతో జారినదే మేలిముసుగు
మయూరాల నడక కలిపి నాట్యాలనే ఆడమంది
మేఘమాల తేరుపైన విహరించగ పిలిచినదీ
మురళి పాట రాగాలకు మువ్వలనే కదపమంది
మారాముల మాయావికి తిరుగులేని విజయములే
గోధూళిలొ గోకులాన నవ్వులనే నింపమంది