గజల్ విజయ గోలి
మన్నేదన చిన్నినోట భువనమాడ అచ్చెరువే
కాళిందుని పడగలపై నర్తనాడ అచ్చెరువే
గోటికొనన గోవర్ధనమె గొడుగల్లే కాచావుగ
అడుగడుగున ఆపదలతొ ఆటలాడ అచ్చెరువే
వేణువూది వ్రేపల్లెను పరవశాన ముంచినావు
గోకులాన గోవిందుడు చిందాడగ అచ్చెరువే
ఇంటింటను నీవేగా ప్రతిఇంతి సరసనీవె
నవనీతపు నవ్వులలో మాయలాడ అచ్చెరువే
నీచేతల పరమార్థమె తెలిపినావు విజయ”గీత
రుక్మిణమ్మ తులసినిడగ తూగాడగ అచ్చెరువే