గజల్. రచన-:విజయ గోలి
గుండెగూటి గురుతులతో ఆడనీయి కలకాలం
గువ్వలాడు గుసగుసలే పాడనీయి కలకాలం
వనమంతా సుమచరుడే శరములతో తిరిగేనులె
హరుడికన్ను తెరవకుండ ఆపనీయి కలకాలం
శిశిరాలలో దాగాయిలె వసంతాల తొలిచిగురులు
రాలిపోని హరితాలనే ఎదగనీయి కలకాలం
కలసిరాని కలుములేల మదినెరిగిన మైత్రిచాలు
కోరికలకు తారలనే రాలనీయి కలకాలం
మంచివెంట నీడలాగ నడిచేదిక విజయమేగ
వేడుకునే వేదనలకు విలువనీయి కలకాలం