*శిశిరం
రచన -విజయ గోలి
ప్రక్రియ-: వచన కవిత
శిశిరం దాచిన రంగులలో
చూస్తున్నా నిన్నటి వసంతాన్ని
చిత్రంగా కదిలింది నీరూపం
విరబూసిన కలల చిత్రం
విదిలించిన కుంచెల పలకరింపు
మంచుపూల జల్లులతో
మది నిండిన జ్ఞాపకాలు
తొలి వెలుగుల రేకలలో
గరికపూల సోయగాలు
చెంగలువలపై చెదరిన
మంచుముత్యాల రాశులు
పుడమి పూజలో
పున్నాగల సన్నాయి
పారిజాతాల అక్షితలు
నవ్వుతున్న నందివర్ధనాలు
ప్రకృతి పాడుతున్న రాగాలు
శిశిరం మ్రోడులని
చిన్నచూపు ఏల
మంచు దుప్పటి
మాటున నిదురిస్తున్న
చిగురుల వసంతమేగ
వెచ్చని ఆశల కంబళి
కప్పుకున్న ప్రకృతి
కలల సాకారానికి
ఆరామమేగా
సృజనల కందని
స్నిగ్ధ రూపమే శిశిరం
శిశిరానికి దారి చూపి
రాలిన రాగ రంజిత
వర్ణాలతో రవళించునుగా
నవరాగాలా వసంతం