శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణముల సింగిడి 23/12/2020
అంశం-తాత్వికత కృష్ణం వందే జగద్గురుం
నిర్వహణ -: శ్రీయుతులు వెలిదె ప్రసాద శర్మ గారు
రచన -: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ‖🙏🏻🙏🏻
వటపత్రసాయివై వామనుడవై
భువనములు నిండిన భోగివై
మహా యోగివై అంతర్యామివై
మనసునిండినమాధవుడివై
చేయివీడని చెలిమివై ,చేతవై
కలవై ఇలవై కలిమివైతివే ..కృష్ణా🙏🏻🙏🏻
అంతమే లేని మాతృష్ణలే తీర్చగా
చెరసాలను పుట్టి మాయ తెలిపితివి
అడుగడుగు గండాల అలవోకగా పెరిగితివి
శిఖిపింఛమౌళివై చిరుమువ్వల సవ్వడిగ
చిన్నికృష్ణుని వోలె చిరుతనవ్వుల మెరిసితివి
నందగోకులమంత చిందులేయగ కృష్ణా🙏🏻🙏🏻
మన్నుతిన్న నోట మిన్నులను చూపితివి
వెన్నదొంగవోలె వేడుకలు చేసితివి
గోవర్ధనమెత్తి గోకులము గాచితివి
వలువలను దోచితివి విలువలే తెలిపితివి
ఆత్మజ్ఞనము తెలిపి అన్ని నీవైతివే గోపాల🙏🏻🙏🏻
వెదురు వేణువు చేసి రాగాల రంజిల్ల
వెలదుల నడుమ వెన్నుడవై రాసలీల
వెలిగి తాథ్యాత్మమున తనువు మరిచి
మనసు నీలోన మలుపుట తెలిపితివి
పరము చెప్పి గురువైతివి పరంధామా🙏🏻🙏🏻
కురుక్షేత్రమే నీవుగ
ధర్మము ధరణిపై నిలిపిన నీరజాక్షా
నరుడివై నారాయణుడివై. భగవద్గీత బోధించి
విశ్వమే నీవంటు విరాట్ రూపమే చూపి
భవ బంధాల భ్రమలు బాపేవు గోవిందా🙏🏻🙏🏻
శరణంటు చరణములు తాకితే
కడవరకు కర్తవై కాచేవు కన్నయ్య
ధర్మచింతన తోడి దరి చేరువానికి
చక్రివి నీవై చెంత నిలిచేవు చక్రధారి
కర్మఫలములు కాచి పరమపదమున
నిలుప పరిపర వేడేము పరంధామ🙏🏻🙏🏻
కృష్ణవై విష్ణువై రాముడై రమణుడవై
కాపాడు జగద్రక్షవై🙏🏻🙏🏻🙏🏻🙏🏻