శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 1/9/2020
అంశం -:దృశ్య కవిత ముదిమికి చేయూత
నిర్వహణ-:శ్రీమతి సంధ్యారెడ్డిగారు
రచన-:విజయ గోలి.
శీర్షిక-:వాలుపొద్దున రాలు ఆకులు
రాలిపోవు ఆకులంటె అలుసుఏల
వాలుప్రొద్దు బ్రతుకులపై నిరసనేల
ముదిమి ముడతలు పడుగుపేకల ఆనవాళ్ళే
బ్రతుకు నేసి అలసిపోయిన నేతగాళ్ళే
సృష్టి క్రమమున సాగిపోయే..
నిరంతర ప్రవాహమే వయసు
నేడునేను రేపునీవు పయనమేగ
అలసిపోయిన మనసు
కోరును ఆదరణలే..అన్నమంటూ
అలసి సొలసిన అమ్మానాన్నకు
అన్నీ నీవుగ ఆదరించు
వాడి వుడిగిన వేళనీవు
ఊతకర్రగా చేయినివ్వు.
నవ్వుతూనే సాగనంపే
సమయమివ్వు..
ముసలి అంటూ రోసిపోక
చేతిమీద చేయివేసి
గుండె గుప్పెడు కరగనీయి
జీవముడిగిన కళ్ళలో
జ్యోతి వెలుగును చూడు
ఆదారి నిండిన నవ్వులే
నీఇంట నిలుచును దివ్వెలై
ఆవెలుగు రవ్వలే …
నిండు దీవనలై
నీవెంట నడిచేను..