విజయ గోలి …తరలి వచ్చిన బృందావనం
తొలి వెలుగు కిరణపు నులి వెలుగులు
గరికపూలపై గమ్మత్తుగా తాకుతుంటే
మెరుస్తున్న మంచు ముత్యాలకు
ఏ వజ్రాల నగలు సాటి రాగలవు
మేటి ప్రకృతి సోయగాలముందు
సృష్టికర్త సృజనలోని స్వచ్ఛత
కనుల నిలచిన ప్రతి దృశ్యం
మనోవీణపై మధుర రాగాలను
పల్లవిస్తుంది ..గీతాంజలిగా
చేలగట్లపై విరపూసిన
చెంగలువలు అంచుల మెరసిన
మువ్వల నీహారికలు
చిన్నికృష్ణుని దరహాసాల్లా
నీలిగోరింటలు నీలాంబరాలు
ముళ్ళగోరింటలు నాగమల్లులు
ఊదారంగు గొబ్బిపూలపై
ఊయలూగే గండుతుమ్మెదలు
హేమంతంలోసీమంతపు సందళ్లు
మందారాలు నందివర్ధనాలు
ముద్దులొలికే ముద్ద బంతులు
మురిపాల చేమంతులు
నవ్వులొలికే నవరూప లావణ్యాలు
మంకెనపూల దీపాలతో
పుడమికి ప్రణమిల్లుతూ
పున్నాగలు పారిజాతాలు
మిళితమై అలరించు
నీరాజనాల పుష్పాంజలి
తరలివచ్చిన బృందావనం
మురళి పాడిన మువ్వల రాగం