అందమేది

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం
ఏడుపాయల
సప్త వర్ణాల సింగిడి
అంశం-:నిజమైన ఆనందం. 26/7/2020
ప్రక్రియ-: వచన కవిత
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-:విజయ గోలి గుంటూరు
శీర్షిక-:అందమేది…

ప్రపంచం లో అమాయకమైన బాల్యానికన్నా అందమైనది ..ఆనందమైనది..ఏది లేదనే భావాన్ని వ్యక్తీకరించాలనే చిన్న ప్రయత్నం ..ఆనందం అనేది…ప్రతి మనసులోను నిక్షిప్తమై ఉంటుంది…దానిని ఏరకంగా ఉత్తేజ పరచాలో…మనకు మనం చేసుకోవలసిన ప్రక్రియ …కానీ…పుట్టిన ప్రతి మనిషికి బాల్యంలో..ఆనందం …ఉత్తేజితమై ఉంటుంది…ఆనందం తప్ప ఇంకేమి వుండదు…అందుకే పిల్లల్ని భగవత్ స్వరూపంగా చెప్పుకుంటాం…ఆదశలో పిల్లలు చేసే ప్రతి పని ఎంతో అందంగా…మరెంతో..ఆనందంగా ఉంటుంది…

ఆకాశంలో అందంగా విరిసిన హరివిల్లుని
చేయి జాపి అందుకోవాలనే …
అన్యమెరుగని అల్లరి కంటే ఆనందమేది. అందమేది…
మంచు తడిచి తలలు వంచిన పూల బాలల ..
జాలితో మెడలు నిలిపే ప్రయత్నం లో …
చిట్టి చేతుల శ్రద్ధ కంటే ఆనందమేది….అందమేది?

తల్లి కోసం వెదుకులాడే కుక్కపిల్లను
మెల్ల మెల్లగా ఒడిసి పట్టి
తల్లి ప్రక్కన చేర్చి పక్కుమంటూ నవ్వే …
చిన్ని మోమును మించిన ఆనందమేది… అందమేది ?

నీట మునిగిన గండు చీమను ..
ఆకుతెప్పపై ఒడ్డు చేర్చి…
తప్పట్లు తడుతూ..మురిసిపోయే..
మనసు కంటే ..ఆనందమేది…అందమేది?

బుజ్జి మేకకు మేత మేపి
ముద్దు పెట్టి ముచ్చటాడి
బొజ్జనిమిరి బుజ్జగించే..
బుజ్జితల్లి ప్రేమ కంటే ..ఆనందమేది…అందమేది ?

అమ్మపిలుపుకు అందకుండా ..
పరుగులెత్తి దాగుడు మూతలాడే
పసిడి మువ్వల పాద రవళిని ..
మించిన ఆనందమేది…అందమేది …

యక్ష ప్రశ్నలు అమ్మకేస్తూ
అమ్మ చేతి గోరు ముద్దలు..గోముగా ఆరగిస్తూ…
ఆటలాడే పసితనం కంటే ..ఆనందమేది..అందమేది..

ఆటలాడి అలసి సొలసి
అమ్మ జోలకి నిదురకొరిగి …
,కలల తేరు పై తేలి పోతూ
లేత పెదవుల విరిసి విరియని..
కపటమెరుగని నవ్వుకంటే …
సృష్టిలోన ..ఆనందమేది….అందమేది …

కల్లలెరుగని చిరుతప్రాయపు
చిలిపి చేతల ..బాల్యమును
మించిన..ఆనందమేది….అందమేది…
విశ్వ మందున కనువిందు ఏది ….

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language