అలౌకికం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

*అలౌకికం ..ఒక అనుభవం విజయ గోలి

ఏ అవస్థలో నేనున్నానో ..
నిద్రా… మెలుకువా ..
రెండూ కాని సుషుప్తమా…
పగలో ,రాత్రో ,సమయం తెలియటం లేదు .
ఏదో జరుగుతుంది ..

ఎవరో తలుపు తడుతున్నారు
తీయాలని లేదు ..
తెలియని చల్లదనం చెంపలను తాకుతుంది
మంద్రంగా వేణు గానం ..మై మరపు
తలుపు చప్పుడు ..ఆగటం లేదు

గాలికి కదులుతున్న …కోవెల గంటలు
ఎవరో చెవిలో గుసగుసగా …
ఊసేమిటో తెలియటం లేదు .
కానీ చాలా మధురంగా వుంది
తలుపు చప్పుడు వినపడుతూనేవుంది

మెత్తని పాదాల చిరు మువ్వల సవ్వడి
దగ్గరవుతున్న కొద్దీ కస్తూరి పరిమళం ..
నుదుటి మీద చల్లని పెదవుల స్పర్శ..
అలాగే వుండి పోవాలని పిస్తూంది
తలుపు చప్పుడు ఆగి ఆగి
వినిపిస్తూనేవుంది …

మూసిన కనుల ముందు
సన్నని వెన్నెల వెలుగు దారి ..
ఎవరో చేయి పట్టి నడిపిస్తున్నట్లుగా
మెల్లగా ఆ దారి వెంట నడుస్తున్నాను ..
తలుపు చప్పుడు దూరంగా వినిపిస్తూనే వుంది .

పచ్చని చెట్లు ..పూల తోటలు
సెలయేర్లు కోయిల కుహు కుహూలు
అడవి పూల గుత్తుల మత్తు పరిమళం గమ్మత్తుగా వుంది .
ఆహ్లాదమైన ప్రకృతి పరవశ గీతాలు వినిపిస్తున్నాయి .

ఏవో …కొండలు కోనలు దాటుతున్నాను
ఆ చేయి విడవాలని లేదు ..
అలసట లేదు ఆనందంగా వుంది
అయినా తలుపు చప్పుడు
వినిపిస్తూనే వుంది ..అకస్మాత్తుగా ..

ఒక జ్యోతి ఎదురుగా
దూరంగా దగ్గరవుతూ…
కనులు మూత బడే వున్నాయి
అయినా ప్రజ్వలిస్తూ కనిపిస్తుంది
జ్యోతి చాలా దగ్గరగా వచ్చింది
నా భృకుటికి ఎదురుగా నిలబడింది

నేను జ్యోతిని చూస్తేనే వున్నాను
మనసు చాలా పరవశంగా వుంది
అలౌకికమైన ఆనందం నను కమ్మేసింది.
అలా ఎంత సేపు వున్నానో తెలియదు
తలుపు చప్పుడు ఎపుడు ఆగిందో తెలియదు .
ఎప్పటికో తలుపు చప్పుడు మొదలైంది
మెల్లిగా మొదలై చాలా పెద్దగా వినిపిస్తూంది

మెల్లిగా జ్యోతి కను మరుగవటం మొదలైంది
తలుపు చప్పుడు ఎక్కువైంది
జ్యోతి మరుగైంది…అలౌకిక అనుభవం
మళ్ళీ మళ్ళీ కావాలని వుంది ..
కానీ తలుపు చప్పుడు నివారించాలి ….

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language