అమ్మతనం అడ్డు పెట్టి…విజయ గోలి
ధరణి పేరిట ఓరిమి నీవని
తరువు పేరిట తరుణివి నీవని
కరుణ పేరిట కడలివి నీవని
సుమము పేరిట సుకుమారం నీవని
హిమము నీవని నగము నీవేనని
గాలి నీవని గమనము నీదని
ప్రకృతి లోని పరమార్ధం నీవని
సృష్టి స్థితి లయ గతివి నీవని
జగన్మాత జన్యువు నీవని
గాలిలోన గద్దె వేసి గంధాలే జల్లినారు
అమ్మతనం అడ్డు పెట్టి
అనుబంధపు హద్దు గీత
అబలత్వం అడ్డు పెట్టి
అడుగడుగున అణిచివేత
ఎన్నాళ్ళీ ఎదురీత
ఎదగక తప్పదు నీకు నీవు
సహగమనపు చితుల నుండి
సాధికారత సోపానాలపై
ఎదురులేని ఆత్మ బలం
ఎదనింపుకు ఎదిగావు
తప్పదులే నీ ఓరిమి కిది పరీక్ష
నెగ్గునులే నీ ప్రతిభ ఏనాటికైన …
విశ్వ కీర్తి వింజామర నీవే లే
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు