గజల్ …విజయ గోలి
పిలిచి పిలిచి అలిసినాను బదులీయగ మనసులేద
తలచి తలచి కృంగినాను కరుణించగ మనసు లేద
గ్రీష్మమోర్చి వేచినాను మనసుతడుపు చిరుజల్లుకై
వరదలైన కన్నీరుల ఓదార్చగ మనసులేద
కానుకైన మనసులకే వ్యధమోతలు తప్పనివా?
చరితలెన్నొ చూసినావు చలియించగ మనసులేద
ప్రతిక్షణము గడిచిపోయి జ్ఞాపకమై తిరిగివచ్చు
కదులుతున్న కాలంతో కలసినడవ మనసులేద
కాల్చివేయు కార్చిచ్చుల ఆర్పలేవ విజయముగా
అందమైన బంధాలను అలరించగ మనసులేద