శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కన్నులార చూడలేదు గుండెలోన వేదనాయె
ప్రియమారగ మాటలేదు మనసంతా మౌనమాయె
తరలివచ్చు బాటసారి తలపులేదు తారలకే
గాలివాలు కబురైనా ఆనవాలు చూపదాయె
వలపుపూలు వాడెనేమొ ఆమనియే అలసిపోయె
చిరుగాలుల విసురులాగె చిగురాకుల అలకలాయె
వెన్నెలలో జలతారుల అలలపైన ప్రేమనావ
జ్ఞాపకాల జల్లులలో జలకమాడు కలువలాయె
కనుపాపల దివ్వెనైతి విజయమాయె వెలుగులలో
చందమామ నందుకోను చకోరితో పంతమాయె