లచ్చిమీ
విజయ గోలి
అరక దున్ని అలసి పోతి
వేడి నీళ్ళు తొలిపి పెట్టె
ఉడుకు అన్నం ఊర మిరప
అరచేత కలిపి పెట్టె …ఆది లచ్చిమీ
ఉట్టిమీద ఉప్పుచేప
ఉల్లిపాయ కూర చేయె
కొర్రమీను కోరితెస్తి
మాపటేళ వండి పెట్టె మా లచ్చిమీ
మువ్వలూగు ముచ్చటైన
కాలిపట్టాలు తెచ్చినానె
ఘల్లుఘల్లు నట్టినింట
నవ్వులతో నడిచి చూపె నాగ లచ్చిమీ
గంగులమ్మ గట్టుకాడ
గాజులెన్నొ ఎంచినానె
గౌరిరంగు గాజులేసి
వగలుపోతు వడ్లుదంచె వర లచ్చిమీ
సింగిశెట్టి షాపుకాడ
సిలుకుచీర తెచ్చినానె
జారనీక పైటచెంగు
పదిలంగా చీరకట్టె. చిన్నిలచ్చిమీ
మనసుతీరా మల్లెపూల
మాలతెస్తి నీకోసం
సందెలాయె సడిచేయక
కొప్పునిండ పూలుపెట్టె శీ లచ్చిమీ
మసకఎన్నెల మాటులోన
పట్టెమంచం పానుపేసి
చిలుకమల్లే పలుకలాడి
తమలపాకు చిలపచుట్టె ఓ.. లచ్చిమీ