విజయ గోలి. గజల్
కష్టమైన సుఖమైన అందరితో పంచుకుంది
పల్లెలోని తియ్యదనం బాటేమిటొ ఎంచుకుంది
మట్టిమిద్దె గట్టితనం దొంగకెపుడు దొరకనిదే
తాతఇల్లు ఆ తరాల కోటలాగే నిలబడుంది
చద్దిముద్ద చల్లదనం ఆప్యాయత ఆనందం
వేసవిలో పైరగాలి ఆదమరుపు అందుకుంది
అనురాగపు పలకరింపు అభిమానపు ఆదరింపు
గుండెనిండు గుర్తింపులు నిండుతనం నింపుకుంది
గోపురాన గువ్వలాడె గుడిగంటల సవ్వడిలో
ఒంటికంటి ఇంటివెలుగు నేడేమిటొ జరుగుతుంది
జమానాలు జల్దిగానే జరిగిపోయె జర ఆగక
శిథిలాలలొ ప్రేమలనే చిత్రాలుగా చూపుతుంది
పంచుకున్న మెతుకులలో పరమాన్నపు తియ్యదనం
కలిసివున్న కలిమినెపుడు విజయాలుగ చెప్పుతుంది